ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిని తరలించేందుకు వీలుగా… ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడితే… మద్దతిస్తానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చెప్పడంతో… ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై చర్చించిన పార్టీ… ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల్ని వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ.. తన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు ఘాటు లేక రాశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే.. ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్‌మెంట్ రిజియన్ యాక్ట్ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లుల్ని వ్యతిరేకించాలని పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని అదే సమయంలో పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఒకవేళ రాపాక జనసేన పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. కాగా, గత కొన్ని రోజులుగా జనసేనతో సంబంధం లేదన్నట్లుగా రాపాక వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా శాసనసభలో మూడు రాజధానుల ప్రతిపాదన అంశంపై ఓటింగ్ జరిగితే దానికి మద్దతుగానే ఓటు వేస్తానంటూ ఎమ్మెల్యే రాపాక ఇప్పటికే స్పష్టం చేశారు.