– సాగర్ ఉప ఎన్నిక గెలుపే లక్ష్యం ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీలు
– విభేదాలు పక్కన బెట్టి ముందుకు సాగే కార్యాచరణలో కాంగ్రెస్
– ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీఆర్ఎస్.. మ్యాజిక్ చేయాలనుకుంటున్న బీజేపీ !
– బరిలోకి జానా రెడ్డి.. అందరిచూపు దానిపైనే..!
హైదరాబాద్ః తెలంగాణలో ఇటీవల జరిగిన పలు ఉప ఎన్నికలు, అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకున్న స్థాయిలో ఫలితాలు రాబట్టకపోవడంతో ఆ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది. మరో వైపు బీజేపీ మాత్రం తన దూకుడును కొనసాగిస్తూ.. ఆశ్చర్యకర రీతిలో ప్రజల్లోకి మరింతగా దూసుకుపోతోంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో దారుణంగా విఫలం కావడంతో కాంగ్రెస్ అంతర్మథనంలో పడింది.
ఇలాంటి నేపథ్యంలో ఉన్న వేళ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు త్వరలో జరగనుండటంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీల దీనిపై నజర్ పెట్టాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌కు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఎలాగైన ఇక్కడ విజయం సాధించి పార్టీ కార్యకర్తలో జోష్ నింపాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. దీనిని కోసం ఇప్పటివరకూ కొనసాగిన అంతర్గత కలహాలను పక్కన బెట్టి నేతలందరూ సాగర్ గెలుపు పై దృష్టి సారిస్తున్నారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా రాష్ట్ర నేతలకు మార్గనిర్ధేషం చేస్తోంది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో విజయం లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్.. ఈ ఎన్నిక పూర్తి అయ్యేంత వరకూ ఎలాంటి అంతర్గత తగాధాలు రాకుండా చూసుకుంటోంది. దీని కోసం పీసీసీ అధ్యక్ష పదవి నియామకాన్ని కూడా వాయిదా వేసింది. నేతలందరూ కూడా ఈ నిర్ణయానికి అనుకూలంగా స్పందించడం గమనార్హం. ఈ క్రమంలోనే నేతల మధ్య ఐక్యత కుదిరేలా అధిష్ఠానం చర్యలు తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సాగర్ ఉప ఎన్నిక జరుగుతుండటం.. అలాగే, సీనియర్ నేత, నాగులు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న జానా రెడ్డి బరిలోకి దిగుతుండటంతో కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.
కాగా, సాగర్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి కూడా కీలకంగా మారింది. ఎందుకంటే ఇదివరకూ జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ప్రజల్లో టీఆర్ఎస్‌కు నమ్మకం మరింత సడలకుండా ఉండాలంటే గెలుపే లక్ష్యంగా రాష్ట్ర అధికార పార్టీ ముందుకు సాగుతోంది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఈ పార్టీకి కలిసివచ్చే అవకాశముంది. మరో వైపు ఊపులో ఉన్న బీజేపీ సైతం.. ఇదే దూకుడును కొనసాగించాలని భావిస్తోంది. అన్నీ ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతుండటంతో ఆసక్తికర పోరు జరగబోతుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. చూడాలి ఈ సాగర మథనంలో ఎవరూ విజయబావుట ఎగురవేస్తారో..!!