అందరి ఊహాగానాలను తెరదించుతూ ఆర్.ప్రవీణ్‌కుమార్ PraveenKumar తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. అయితే మొదటి నుంచి ఆయన పొలిటికల్ ఫీల్డ్‌లోకి వస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక వీటికి ఆయన కూడా ఓకే అన్నట్టు సంకేతాలు కూడా ఇచ్చేస్తున్నారు. అయితే ఆయన హుజూరాబాద్‌లో టీఆర్ ఎస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగినప్పటికీ ఆయన మాత్రం దానికి ఛాన్స్ లేదన్నట్టు ఏకంగా కేసీఆర్ పైనే విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగామారింది.
రీసెంట్ గా మేడ్చల్ లో స్వేరోస్ మీటింగ్‌లో మాట్లాడిన ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా నిన్న నల్గొండలో బహుజన ఉద్యోగుల మీటింగ్‌లో కూడా ఆయన ఇదే విధంగా కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఓట్ల కోసమే దళిత బంధు అంటూ ప్రచారం చేస్తున్నారని, నమ్మి మోసపోవద్దని వ్యాఖ్యానించారు. బహుజనులు తరఫున ఉన్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా కేసీఆర్ పై ఒత్తిడి తేవట్లేదని తెలిపారు.
ఇక తన రాజకీయ ప్రస్థానం గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. నల్గొండ నుంచే తన రాజకీయ జీవితం ప్రారంభం అవుతుందని త్వరలోనే ఆ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అయితే ఆయన బీఎస్పీలో చేరుతారనే ప్రచారం సాగుతున్నా ఆయన మాత్రం దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక తన రాజకీయ జీవితం మొత్తం బహుజనుల కోసమే ఉంటుందని స్పష్టం చేశారు. అంటే మొత్తానికి ఆయన టీఆర్ ఎస్‌లో చేరే అవకాశం లేదని తెలుస్తోంది. మరి ఆయన ఎటువైపు పయనిస్తారో చూడాలి.