ఎప్పుడైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో అప్పటినుంచే మునుగోడులో మళ్ళీ గెలుపే లక్ష్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందుకెళుతున్నారు. ఈ నెల 21న మునుగోడులో అమిత్ షా హాజరైన బీజేపీ బహిరంగ సభలో..కాషాయ కండువా కప్పుకున్న కోమటిరెడ్డి..అప్పటినుంచి తనదైన శైలిలో ప్రజల మధ్య తిరగడం మొదలుపెట్టారు. మునుగోడు ఉపఎన్నిక రానున్న నేపథ్యంలో మరోసారి తనకు అండగా ఉండాలని చెప్పి కోమటిరెడ్డి ప్రజలని కోరుతున్నారు.
అదేవిధంగా తన పాత పార్టీ కాంగ్రెస్ శ్రేణుల మద్ధతు కూడా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది…అయితే కోమటిరెడ్డి బీజేపీలోకి వెళ్ళినా సరే..మునుగోడులో కాంగ్రెస్ శ్రేణులు పూర్తి స్థాయిలో బీజేపీలోకి రాలేదు. కాంగ్రెస్ పై అభిమానంతో చాలామంది కార్యకర్తలు…కోమటిరెడ్డి వెనుక నడవలేదు. అందుకే వారని తమ వైపు తిప్పుకునేందుకు కోమటిరెడ్డి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
వూరు వూరు తిరుగుతూ కాంగ్రెస్ శ్రేణుల మద్ధతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తి నేతలని సైతం తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ లో గెలుపు కోసం ఈటల రాజేందర్ ఏ ఫార్ములాని అనుసరించారో అదే ఫార్ములాతో ముందుకెళుతున్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ శ్రేణులని ఈటల తన వైపుకు తిప్పుకున్నారు…అలాగే కాంగ్రెస్ శ్రేణుల మద్ధతు కూడా పొందారు. అందుకే హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాలేదు. అలాగే ఈటల గెలిచారు.
అదేవిధంగా ఉపఎన్నిక పార్టీల మధ్య పోటీ కాదని, ప్రజల మద్ధతు ఉన్న తనకు, అధికార బలం ఉన్న కేసీఆర్ మధ్య జరిగే పోరు అని ఈటల ప్రచారం చేశారు. ఇది ఈటలకు బాగా బెనిఫిట్ అయింది. ఇప్పుడు మునుగోడులో కోమటిరెడ్డి సైతం అదే తరహాలో ముందుకెళుతున్నారు. కేసీఆర్ కుటుంబానికి, మునుగోడు ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నిక అని ప్రచారం చేస్తున్నారు. అలాగే దమ్ముంటే కేసీఆర్ మునుగోడులో పోటీ చేయాలని ఈటల మాదిరిగా కోమటిరెడ్డి సవాల్ చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈటల ఫార్ములాతోనే కోమటిరెడ్డి ముందుకెళుతున్నారు…మరి ఈ ఫార్ములా మునుగోడులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.