టీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ఎఫెక్ట్.. వారి చూపు ఆయన వైపు..?

టీపీసీసీ అధ్యక్షుడిగా ఇలా తన పేరుని అధిష్టానం ప్రకటించిందో లేదో అప్పుడో మల్కాజ్ గిరి ఎంపీ, ప్రస్తుత టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన స్పీడును పెంచేశారు. ఇన్నాళ్లు రాష్ర్టంలో తమకు రాజకీయంగా ఎలాంటి ఎదురు లేదని భావించిన టీఆర్ఎస్ అధిష్టానం కూడా టీపీసీసీగా రేవంత్ పేరుని అధిష్టానం ఖరారు చేయడంతో ఆలోచనలో పడిందట. టీఆర్ఎస్ పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న నేతలు పార్టీని వీడి రేవంత్ పంచన చేరే ప్రమాదముందని భావిస్తున్నారట.

 

రేవంత్ రెడ్డి | Revanth Reddy

అలా జరగకుండా ఉండేందుకు జిల్లాల వారీగా టీఆర్ఎస్ నేతలతో త్వరలో సమావేశాలు కూడా జరిపేందుకు ఆలోచిస్తున్నారని సమాచారం. ఒక వేళ గులాబీ అసంతృప్త నేతలు రేవంత్ రెడ్డి పంచన చేరితే…. మొదటికే మోసం వస్తుందని గులాబీ అధిష్టానం యోచిస్తుందట. రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ రాష్ర్టంలో తమకు పోటీగా నిలిచే అవకాశం ఉందని గులాబీ నేతలు కంగారు పడుతున్నారట.

రేవంత్ రెడ్డి రాకతో అధికార టీఆర్ఎస్, టీటీడీపీల్లో ఇప్పటికే కుదుపులు మొదలయ్యాయని పలువురు చర్చించుకుంటున్నారు. టీడీపీ విషయం గురించి కాసేపు పక్కన పెడితే అధికార టీఆర్ఎస్ పార్టీ హుటాహుటిన జిల్లాల్లో కారు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైందని.. దీనికి కారణం రేవంత్ రెడ్డి ఎపిసోడే అని అంటున్నారు. ఇకపోతే టీడీపీ పార్టీకి సరైన నాయకుడు లేనప్పటికీ గ్రామాల్లో క్యాడర్ , కార్యకర్తలు బలంగా ఉన్నారు.

వీరందరినీ వాడుకోవాలని రేవంత్ చూస్తున్నాడట. టీడీపీ నుంచి కారు పార్టీలో చేరి తమకు సరైన ప్రాధాన్యం దక్కట్లేదని భావిస్తున్న నేతలు రేవంత్ రెడ్డి పంచన చేరే అవకాశాలు ఉన్నాయని గులాబీ అధిష్టానం గుబులుగా ఉందట. ప్రస్తుత టీపీసీసీ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆలోచనలకు మొదట్లోనే బ్రేకులేయాలనే ఉద్దేశంతో నేతలను కాపాడుకునేందుకు రంగంలోకి దిగిందని సమాచారం.