తెలంగాణలో ప్రజా సమస్యలపై రేవంత్ రెడ్డి పోరాటాన్ని మొదలుపెట్టారు. పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న వెంటనే, ప్రజా క్షేత్రంలోకి దిగేశారు. మొదటిగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుదలపై పోరాటం తీవ్రం చేశారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా, బీజేపీ-టీఆర్ఎస్‌లని టార్గెట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా పెట్రోల్, డీజిల్‌లపై ట్యాక్స్‌లు పెంచడంతోనే ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుదల వల్ల, సామాన్యుడుకు అవసరమయ్యే ప్రతి వస్తువు రేటు పెరిగిపోయింది.
అందుకే ఈ అంశాన్నే ఆయుధంగా చేసుకుని రేవంత్ రెడ్డి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తున్నారు. తాజాగా ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం చేశారు. ఇలా పోరాటం చేయడం వల్ల రేవంత్‌కే ప్లస్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా టీఆర్ఎస్, బీజేపీలని ఒకేసారి టార్గెట్ చేసినట్లు అయింది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీ, ఈ అంశంపై పోరాటం చేయలేదు.
అందుకే రేవంత్ ఈ దారిలో వచ్చారు. అయితే ఇలా పోరాటాలు చేయడం వల్ల కేసీఆర్‌కు తానే ప్రత్యామ్నాయమనేలాగా రేవంత్ ముందుకెళుతున్నారు. బీజేపీ, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందిగానీ, ప్రజల్లోకి వచ్చి పోరాటాలు చేయట్లేదు. అటు కొత్తగా పార్టీ పెట్టిన షర్మిల తెలంగాణలో సత్తా చాటాలని చూస్తున్నారు. ఆమె కూడా నెక్స్ట్ అధికారంలోకి వచ్చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే రేవంత్ తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. మిగిలిన పార్టీలకు ఛాన్స్ ఇవ్వకుండా, టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చేది కాంగ్రెస్సే అని విధంగా రాజకీయాన్ని మారుస్తున్నారు. అంటే భవిష్యత్‌లో టీఆర్ఎస్-కాంగ్రెస్‌ల మధ్యే అసలు పోరు జరుగుతుందనే విధంగా రేవంత్ రాజకీయం చేస్తూ, ఇతర పార్టీలని సైడ్ చేసేస్తున్నారు.