తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య త్రికోణపు వార్ జరుగుతుంది. ముఖ్యంగా టీఆర్ఎస్‌ని కాంగ్రెస్-బీజేపీలు టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నాయి. అందులోనూ నాయకుల మధ్య తీవ్ర విమర్శల పర్వం నడుస్తోంది. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుల మధ్య ఎలాంటి రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. నాయకుల మధ్య మాటల యుద్ధం అనడం కంటే బూతుల యుద్ధం జరిగిందని చెప్పొచ్చు.ఇక తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డిల మధ్య తీవ్ర స్థాయిలో బూతుల పర్వం నడిచింది. తాజాగా సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో దీక్ష చేసిన రేవంత్ రెడ్డి, కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
అలాగే మంత్రి మల్లారెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్‌గా మల్లారెడ్డి, రేవంత్‌పై బూతులతో విరుచుకుపడ్డారు. అలాగే తాను మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, అటు రేవంత్ ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలని…ఎవరు గెలుస్తారో చూసుకుందమంటూ సవాల్ విసిరారు.
అయితే ఈ సవాల్ సంగతి ఏమో గానీ, మేడ్చల్‌లో తనకు పూర్తి బలం ఉందనే ఉద్దేశంతోనే మల్లారెడ్డి సవాల్ విసిరినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో మల్లారెడ్డి, మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి 88 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఆ ధీమాతోనే మల్లారెడ్డి రాజీనామా అంటున్నారని అర్ధమవుతుంది. కాకపోతే గత ఎన్నికల పరిస్తితి ఇప్పుడు లేదనే చెప్పొచ్చు. కాంగ్రెస్, బీజేపీలు సైతం బాగా పుంజుకున్నాయి.
ఇటు మేడ్చల్ అసెంబ్లీలో కాంగ్రెస్ కాస్త బలంగానే ఉంది. రేవంత్ పిసిసి అయ్యాక మరింతగా కాంగ్రెస్‌కు బలం పెరిగింది. అటు మల్లారెడ్డిపై అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నెక్స్ట్ ఎన్నికల్లో మేడ్చల్‌లో మల్లారెడ్డి గెలుపు అంత సులువైతే కాదని చెప్పొచ్చు.