రోజా స్పీక్స్ : బాబు గారూ ! మేడ‌మ్ ఏదో అంటున్నారు విన్నారా ?

ఎన్నిక‌ల‌కు చాలా దూరంలో ఉన్నా కూడా టీడీపీ గూటి నుంచి వెళ్లిన ప‌క్షులు పాపం ఆ పార్టీ పైనే జోకులు వేస్తున్నాయి. ఆ విధంగా రోజా సెల్వ‌మ‌ణి, విడద‌ల ర‌జ‌నీ ఇంకా ఇంకొంద‌రు మొక్క నుంచి వృక్షం దాకా ఎదిగి పాపం పెద్దాయ‌న‌ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నాయి. దీంతో ప‌సుపు దండు కూడా సీరియ‌స్ గానే రియాక్ట్ అవుతోంది. గెలుపు ఎవ‌రిది అన్న‌ది ముఖ్యం కాదు ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఉన్నామా లేదా అన్న‌దే కావాలి అని టీడీపీ హితోక్తులు చెబుతోంది. ఈ నేప‌థ్యంలో రోజా ను టార్గెట్ చేస్తూ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు కూడా చేస్తోంది. వాద ప్ర‌తివాదాల త‌గాదాల్లో ఎవ‌రు నెగ్గుతారో ? ఇక !

మంత్రి రోజా ఇటీవ‌ల హాట్ కామెంట్స్ చేశారు. ప్ర‌జా మ‌ద్దతు టీడీపీకి లేద‌ని, చంద్ర‌బాబు ప్ర‌చారానికి ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న‌లే లేవ‌ని అంటూ వ్యాఖ్య‌లు చేశారు. మొద‌ట్లో మంత్రి ప‌ద‌వి అందుకున్నాక పెద్ద‌గా మాట్లాడ‌ని రోజా ఇప్పుడిప్పుడే రూట్ మార్చారు. గేర్ ఛేంజ్ చేసి టీడీపీకి ఛాలెంజ్ లు విసురుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడికీ, లోకేశ్‌కీ త‌మ అధినేత జ‌గ‌న్ 70ఎంఎం స్క్రీన్ పై సినిమా చూపిస్తార‌ని అంటున్నారామె ! ఇవ‌న్నీ బాగానే ఉన్నాయి కానీ రోజా నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె చేసిన లేదా చేయించిన అభివృద్ధి పై ఒక్క‌సారి ఓపెన్ డిబేట్ పెడితే.. ఎవ‌రు ఏంటి అన్న‌ది తేలిపోతుంద‌ని టీడీపీ అంటోంది. త‌మ ద‌గ్గ‌ర రాజ‌కీయ పాఠాలు నేర్చుకుని త‌మ‌పైనే పంచులు వేయ‌డం బాలేద‌ని అంటోంది.

ఇక రోజా  ఇటీవ‌ల కాలంలో అధినేత ఆదేశాలు అనుసారం విపరీతంగా టీడీపీ పై వ్యాఖ్య‌లు చేయ‌డం అన్న‌ది అంత బాలేద‌ని, చేయాల్సిన ప‌నులు మానుకుని, ముందరి ల‌క్ష్యాలు చేరుకోవ‌డం మానుకుని కేవ‌లం మాట‌లతో కాలక్షేపం చేయ‌డం బాలేద‌ని అంటున్నారు ఇంకొంద‌రు. ఆమెకు కీల‌క శాఖ‌లు కేటాయించారు. క్రీడ‌లు, యువ‌జ‌న సర్వీసులు మ‌రియు ప‌ర్యాట‌కం. వీటిపై  ఆమె దృష్టి సారించ‌కుండా విప‌క్షాల‌ను ఉద్దేశించి 4 మాట‌లు అంటే అయిపోతుందా ? అభివృద్ధి లేని ఊళ్ల‌ను ప‌ట్టించుకోకుండా..న‌గ‌రి కేంద్రంగా క‌నీస అవ‌స‌రాలు తీర్చ‌కుండా ఎందుక‌ని ఈ మాట‌ల గోల ! అని ఇంకొంద‌రు అంటున్నారు.

రోజా అయినా విడ‌ద‌ల ర‌జ‌నీ అయినా మాట‌లు కాదు క‌దా చెప్పాల్సింది.వైద్యారోగ్యం అప్ప‌గించాక ఆమె చేసిన మంచి ఎంత‌న్న‌ది? మొద‌ట చ‌ర్చ‌కు రావాలి. మంత్రి హోదాలో ఆమె ఇప్ప‌టిదాకా  జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కే రాలేదు. కేవ‌లం  ఒక‌ట్రెండు ఆస్ప‌త్రుల‌లో త‌నిఖీలు చేసి, మీడియా ముంగ‌ట హ‌డావుడి చేసి వెళ్లిపోవ‌డం త‌గ‌దు. క‌నుక అటు రోజా కానీ ర‌జనీ కానీ కీల‌క శాఖ‌ల‌కు బాధ్యులు. అమాత్య హోదాలో ఉంటూ కేవ‌లం విప‌క్ష పార్టీల‌తో త‌గువులు పెట్టుకోవ‌డంతోనే కాలం వెళ్ల‌దీయ‌డం త‌గ‌దు గాక తగ‌దు.