కేసీఆర్ ఫైనల్ టచ్ తో సాగర్ సీటు నిలబెట్టుకుంటారా ?

-

నాగర్జున సాగర్ ఎన్నికల ప్రచారం ముగియడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న సభ రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతుంది. ఉపఎన్నిక షెడ్యూల్‌ రాకముందే హాలియాలో బహిరంగ సభ నిర్వహించి ప్రచార సమరభేరి మోగించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు మరోసారి భారీ ఎన్నికల సభకు సిద్దమయ్యారు. సాగర్‌లో నిర్వహిస్తున్న ఈ సభపై అన్ని వర్గాల దృష్టి ఉంది. లక్ష మందిని సభకు తరలించాలన్నది టీఆర్‌ఎస్‌ నేతల లక్ష్యం. ఎన్నికల రణరంగంలో లాస్ట్‌ పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. కేసీఆర్‌ సభ తర్వాత టీఆర్‌ఎస్‌ విజయవకాశాలు మరింత మెరుగవ్వడంతో పాటు మంచి మెజారిటీ వస్తుందని గులాబీ పార్టీ నేతలు లెక్కలేస్తున్నారు.

 

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక ఉపఎన్నికల ప్రచారం వైపు కన్నెత్తి చూడని కేసీఆర్ ఇప్పుడు రూటు మార్చారు. కంచుకోట లాంటి సిట్టింగ్ సీటు దుబ్బాక కోల్పోవడం..మరోవైపు సాగర్ లో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉండటంతో రెండు నెలల కాలంలో రెండో సారి సాగర్ లో పర్యటిస్తున్నారు కేసీఆర్. సాగర్ లో గెలుపు అంత ఈజీ కాదన్న ఈక్వేషన్ తోనే సిట్టింగ్ సీటు నిలబెట్టుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం ప్రత్యర్థులపై పూర్తిస్థాయిలో పైచెయ్యి సాధించే వ్యూహంలా కనిపిస్తుంది.

సాగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ గెలుపు పై భారీ ఆశలు పెట్టుకుంది టీఆర్ఎస్. ఈ గెలుపు అనేక ప్రశ్నలకు సమాధానం చెబుతుందన్న అభిప్రాయం గులాబీ శిబిరంలో ఉంది. సీనియర్‌ నేత జానారెడ్డిని ఓడించడం ద్వారా కాంగ్రెస్‌ను మళ్లీ కోలుకోకుండా చేయాలన్నది ఒక వ్యూహం కాగా.. తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకొంటున్న బీజేపీకి చెక్‌ పెట్టాలని టీఆర్‌ఎస్‌ చూస్తోంది. అందుకే ఉపఎన్నిక వ్యూహాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కేసీఆర్‌. కేటీఆర్ సైతం ఉపఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండటం..జిల్లాకి సంబంధంలేని నేతలకు పూర్తి బాధ్యతలు అప్పగించడం కేసీఆర్ స్ట్రాటజీగా తెలుస్తుంది.

సాగర్‌కు ముందు జరిగిన దుబ్బాక, హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్‌ వెళ్లలేదు. వాతావరణం అనుకూలించక హుజూర్‌నగర్‌ సభ చివరి నిమిషంలో రద్దయింది. అయినప్పటికీ కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానాన్ని భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్‌ కైవశం చేసుకుంది. దుబ్బాక మాత్రం కోల్పోయింది. దీంతో సాగర్‌లో వ్యూహం మార్చేశారు అధికార పార్టీ నాయకులు. నాటి హాలియా సభలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి హామీల వర్షం కురిపించారు కేసీఆర్‌. దీంతో తాజా సభలో కేసీఆర్‌ ఇంకేం చెబుతారు అన్న ఆసక్తి నెలకొంది.

కరోనా వేళ భారీ బహిరంగ సభలేంటని సీఎం కేసీఆర్‌ సభ పై విమర్షలు చేస్తుంది కాంగ్రెస్. సభ విషయంలో జానారెడ్డి అండ్‌ బ్యాచ్ చేస్తున్న విమర్శలను టీఆర్‌ఎస్‌ పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం పై గెలుపు పై గురిపెట్టిన అధికార పార్టీ ఏ చిన్న అవాకాశాన్ని వదులుకునేలా లేదు. ప్రచారం తర్వాత పోల్ మేనెజ్ మెంట్ సైతం అదే స్థాయిలో నిర్వహించాలని చూస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news