షాడో వ్యక్తిని కలిస్తే ఆ మంత్రి దగ్గర వెంటనే పనైపోతుందా ?

-

ఆ వ్యక్తి మంత్రికి పీఎస్ కాదు.. పీఏ కాదు. కనీసం పీఆర్వో కూడా కాదు. ఆఖరికి అటెండర్ అంతకన్నా కాదు. కానీ జిల్లాలో ఏ అధికారికి పోస్టింగ్‌ కావాలన్నా ఆయన్ని కలిస్తే వెంటనే పనైపోతుందట. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఓ షాడో చక్రం తిప్పుతున్నాడట అమరావతి నుంచి నరసన్నపేట వరకు మంత్రి కుటుంబ సభ్యుల పేర్లు వాడేస్తూ ఓ రేంజ్‌లో పైరవీలు చేస్తున్నారట. ఈచోద్యం చూసిన ఆధికార పార్టీనేతలు ఆయన దూకుడు చూసి అవాక్కవుతున్నారట…

శ్రీకాకుళం నరసన్న పేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ డిప్యూటీ సీఎం అయ్యాక కాస్త బీజీ అయ్యారు. దీంతో నియోజకవర్గంలో పార్టీతోపాటు ఇతర బాధ్యతలను దాసన్న కుమారుడు కృష్ణ చైతన్య చూసుకుంటున్నారు. ఈ విషయంలో ఎక్కడా విమర్శలు లేకపోయినప్పటికీ షాడోగా మారిన ఓ వ్యక్తి వల్ల డిప్యూటీ సీఎం కుటుంబానికి మచ్చ వచ్చేలా ఉందని చర్చ జరుగుతోంది. మంత్రి కుమారులకు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన సదరు షాడోపై జిల్లాలో కథలు కథలుగా చెప్పుకొంటున్నారట.

ప్రభుత్వ పథకాలు అందరికీ ఒకేలా అందాలి.. అవినీతికి తావు లేకుండా చేయాలి అని పదే పదే చెబుతున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ పదే పదే చెబుతున్న.. ఈ షాడో నిర్వాకంతో బ్లేమ్ అవుతున్నారట. ఎవరికైనా మంత్రి లెటర్‌ కావాలన్నా.. జిల్లాలో పోస్టింగ్‌లు వేయాలన్నా.. ముఖ్యలు ఎవరైనా మంత్రిని కలవాలన్నా ఆ షాడో వ్యక్తిని ఆశ్రయిస్తే క్షణాల్లో పనైపోతుందని నరసన్నపేటలో జోరుగా చర్చ జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా వైసీపీ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ హాట్ టాపిక్ గా మారింది.

గతంలో జిల్లాలో హౌసింగ్‌ ఏఈగా పనిచేసిన ఓ అధికారి సస్పెండ్‌ అయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో ఆ అధికారికి ఎక్కడా పోస్టింగ్‌ దక్కలేదు. ఆ అధికారి ఎవరో కాదు.. ఈ షాడో వ్యక్తికి తండ్రిగా చెబుతున్నారు. ఇప్పుడు ఆ హౌసింగ్‌ ఏఈకి జిల్లా కేంద్రంలోనే పోస్టింగ్‌ ఇప్పించుకున్నారట. అప్పటి నుంచి పైరవీల విషయంలో సదరు షాడో ఆరితేరిపోయినట్టు సమాచారం. కృష్ణదాస్ ఆయన కుమారుడు అందుబాటులో ఉన్నా.. సదరు షాడో వ్యక్తిని కలవనిదే ఏ పని జరగదన్నది ఇక్కడ వినిపించే మాట.

రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం ఇచ్చే అన్ని శాఖల్లోనూ మంత్రి కుటుంబం పేరు వాడేసుకుంటున్నట్టు సమాచారం. ఇటీవల గృహ నిర్మాణ శాఖలో భారీగా ముడుపులు తీసుకుని ఒకరికి మేనేజర్‌ పోస్టు ఇప్పించారట. జిల్లాలో వివాద రహితుడిగా పేరున్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌కు ఈ షాడో వల్ల ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయట. ఒకవేళ ధైర్యం చేసి దాసన్నకు చెబితే ఆయన ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అన్న టెన్షన్‌ కూడా ఉందట. ఎవరి భయం ఎలా ఉన్నా.. షాడో మాత్రం నరసన్నపేటలో ఓ రేంజ్‌లో చక్రం తిప్పుతుండటమే చర్చనీయ అంశంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news