సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఎంయూ.. తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డికి తన రాజీనామా లేఖను పంపించారు.
అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీఎంయూ కార్యక్రమాలకు సమయం కేటాయించాలి. అయితే.. సమయం కేటాయించలేకపోవడం వల్లనే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు హరీశ్ రావు తెలిపారు. హరీశ్ రావు సడెన్ గా తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచే హరీశ్ రావు తెలంగాణ మజ్దూర్ యూనియన్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యోగులకు ఇన్నేళ్లు ఆయన అండగా నిలిచారు. వాళ్ల డిమాండ్లను పరిష్కరించడంలో ముఖ్య పాత్ర పోషించారు.
అయితే.. హరీశ్ రావు రాజీనామాపై తెలంగాణ రాజకీయాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇంకా మంత్రి వర్గ విస్తరణ చేయలేదు. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో హరీశ్ రావు టీఎంయూ పదవికి రాజీనామాకు, మంత్రి వర్గ విస్తరణకు ఏదైనా సంబంధం ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.