పవన్‌ కోరుకున్నట్టుగానే ఏపీలో పరిస్థితులు వైకాపాను చుట్టుముట్టిన విపక్షాలు

-

.జనసేనాని అనుకున్నట్టుగానే ఒంటరైన వైకాపా
.రూట్‌ మార్చిన బీజేపీ…..టీడీపీ
.అందరి లక్ష్యం ఒక్కటే. . . వైసీపీని సాగనంపడం

ఏపీలో వైసీపీని ఒంటరిని చేయాలన్న పవన్‌ సంకల్పం కార్యరూపం దాల్చినట్లు కనిపిస్తున్నాయి.వైసీపీ వ్యతిరేక ఓటును చీలినివ్వబోమని తొలినుంచీ చెప్తున్న పవన్‌ కళ్యాణ్‌ ఆ దిశగా కాస్త సక్సెస్‌ సాధించినట్టే కనిపిస్తోంది.ప్రభుత్వంతో నాలుగేళ్ళు సఖ్యతగా ఉన్న బీజేపీ ఉన్నట్టుండి స్వరం మార్చింది. చంద్రబాబునాయుడు ఢిల్లీలో అమిత్‌షాను కలిసి వచ్చినప్పటి నుంచి ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి.అప్పటి వరకు నిధులిచ్చి ఏపీ అభివృద్ధికి సహకరించినట్టు కనిపించిన బీజేపీ రూట్‌ మార్చి ఎదురుదాడికి దిగింది. విశాఖలో ఏర్పాటు చేసిన సభలో అమిత్‌షా వైసీపీ లక్ష్యంగా విమర్శలు చేశారు. నాలుగేళ్ళలో ఏపీలో జరిగిన అభివృద్ధి శూన్యమని దుమ్మెత్తిపోశారు. అంతటితో ఆగకుండా జేపీ నడ్డా కూడా ప్రభుత్వమే లక్ష్యంగా ఆరోపణలు చేశారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏపీలో సీఎం స్టిక్కర్‌లు వేయించుకుంటున్నారని నిప్పులు చెరిగారు.ఎలాంటి సంకేతాలు లేకుండా వైసీపీపై బీజేపీ మొదలుపెట్టిన దాడి వెనుక ఆ పార్టీలో ఉన్న మాజీ టీడీపీ నేతలే కారణమంటూ అధికార పార్టీ మండిపడుతోంది. మరోవైపు బీజేపీ నేతల విమర్శల వెనుక అసలు కారణం పవన్ కళ్యాణ్‌ అని చర్చ జరుగుతోంది.

మరోవైపు ఏపీలో అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఆరోపించిన చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వంపై విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏపీలో శాంతిభద్రతలు స్తంభించాయని,మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధినేత అన్నారు. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు,గ్రావెల్‌ తవ్వకాలు చేస్తూ రాష్ర్టాన్ని దోచేస్తున్నారని చెప్పారు.ఇటీవల ఢిల్లీలో అమిత్‌షాను కలిసినప్పుడు వైసీపీ అనుసరిస్తున్న విధానాలను వివరించారని తెలుస్తోంది. దమ్ముంటే వైసీపీపై చర్యలు తీసుకోగలరా అంటూ కేంద్రానికి సవాల్‌ విసిరారు చంద్రబాబు.

అటు టీడీపీలోని మాజీమంత్రులు,ఎమ్మెల్యేలు కూడా వైసాపీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
కర్నాటక విజయంతో ఏపీలోనూ కాస్త ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా వైసీపీ టార్గెట్‌ చేశారు.విశాఖ ఉక్కు విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ వామపక్షాలు కూడా వైకాపాను లక్ష్యం చేసుకున్నారు. ఇలా విపక్షాలన్నీ ఒక్కసారిగా అధికార పార్టీని చుట్టుముట్టారు.

నాలుగేళ్లుగా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం జరగలేదని భావిస్తున్న పవన్ కళ్యాణ్.. అందరినీ ఒక్కతాటిపైకి తెస్తే తప్ప ఉనికి కాపాడుకోవడం కష్టమనే భావనకు వచ్చారు.దీంతో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్ని కూడగట్టాలని గతేడాదే నిర్ణయించినా ఆశించిన ఫలితం రాలేదు.అప్పటి నుంచి పలుమార్లు మోడీని,అమిత్‌షాను కలిసిన పవన్‌ కళ్యాణ్‌ రూట్ మ్యాప్ ఇవ్వాలని అడుగుతున్నారు. రూట్‌ మ్యాప్‌ విషయంలో బీజేపీ ఎటూ తేల్చకపోవడంతో పవన్‌ కొతంకాలం మౌనం వహించారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తానే ఒంటరిగా ప్రజల్లోకి వెళ్తున్నారు జనసేనాని.చివరికి పవన్ కోరుకుంటున్నట్లుగానే ఎన్నికలకు 9 నెలల ముందు వైసీపీపై బీజేపీ పోరు మొదలైపోయింది. ఇందులో భాగంగానే అమిత్ షా, జేపీ నడ్డా ఏపీకి వచ్చి నిప్పులు చెరిగారు. దీంతో అధికార పార్టీ ఇరుకున పడినట్లయింది.ఇక చేసేదేమీ లేక వైసీపీ నేతలు కూడా కౌంటర్లు మొదలుపెట్టారు. మొత్తానికి పవన్‌ కళ్యాణ్‌ సంకల్పం నెరవేరి చివరికి వైసీపీ వర్సెస్ విపక్షాలు అన్నట్టుగా మారిపోయింది ఏపీలోని పరిస్ధితి.

Read more RELATED
Recommended to you

Latest news