ఓ విధంగా ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. కానీ కార్యకర్తలకూ, వలంటీర్లకు మధ్య సంబంధాలు అయితే లేవు. ఇదే ఇప్పుడు శ్రీకాకుళ నగర వైసీపీ ని వెన్నాడుతోంది. దీంతో ఇంఛార్జులను మారిస్తే కానీ ఎవ్వరూ దార్లోకి రారు అన్న ఉద్దేశంతో రెవెన్యూ మంత్రి ధర్మాన నిన్నటి వేళ ఆగ్రహం వ్యక్తం చేశారు అని ప్రధాన మీడియాలో వార్తలు ధ్రువీకరిస్తున్నాయి.కొద్ది మంది మాత్రమే ధర్మాన వెన్నంటి ఉంటూ ఉంటున్నారు కానీ, మిగతా వారు డివిజన్ స్థాయిలో పెద్దగా యాక్టివ్ కావడం లేదు. మున్సిపల్ కౌన్సిల్-కు సంబంధించి పదేళ్లుగా జనరల్ బాడీ లేకపోవడంతో స్థానికంగా అధికారిక పదవులు ఏవీ లేని కారణంగానే వీరంతా స్తబ్దుగా ఉంటున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యాన శ్రీకాకుళం నగర వైసీపీ కార్యకర్తలు సన్నాహక ప్లీనరీ ని పట్టించుకోవడం లేదు. ఈ నెల 26న జరిగే (అంబేద్కర్ ఆడిటోరియం) శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వర్గ స్థాయి ప్లీనరీని పట్టించుకోవడం లేదు..అదేవిధంగా ఈ నెల 27 న ముఖ్యమంత్రి రాక సందర్భంగా సంబంధిత ఏర్పాట్లలోనూ హుషారుగా లేరు. వీరిపైనే నిన్నటి వేళ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పార్టీ నాయకులలో కొందరు బాధ్యతగా లేరని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా కొన్ని డివిజన్లలో నాయకులు సమావేశాలకు సరిగా, సకాలంలో..రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి నాపై కూడా నిఘా ఉంచారని, కనుక నాతో సహా ప్రతి ఒక్కరూ బాధ్యతతోనే వ్యవహరించాలని చెప్పారు.
మరోవైపు కార్యకర్తల వాదన మరో విధంగా ఉంది. అసలు పథకాలు పంచుతున్నది, అర్హులకు అందుతున్నది లేదు అన్నది తెలుసుకుంటున్నది తాము కాదని వలంటీర్లే అని, అంతా వలంటీర్ల అయి నడిపిస్తున్నప్పుడు తాము ఉండి ఏం చేయాలి అని
ఓ ప్రశ్న సంధిస్తున్నారు. స్థానిక నగర నాయకులు కూడా ఇదే అసంతృప్తితో ఉన్నారు. దాదాపు పదేళ్లు పార్టీ జెండాలు మోసిన వారికి పట్టుమని పదివేలు రూపాయల పని కూడా దక్కడం లేదని, అయినా కూడా జెండాలు మోసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని వారి వెర్షన్ ఒకటి వినిపిస్తున్నారు.