స్థానిక ఎన్నికల పై టీడీపీ కేడర్ లో ఆసక్తికర చర్చ

-

స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవాలు, ఘర్షణలు ఒక ఎత్తు అయితే.. ఎన్నికలను ఎదుర్కోవడం మరో ఎత్తుగా మారింది తెలుగుదేశం పార్టీకి. ఇప్పటికే పైసా ఇవ్వలేమని అధిష్ఠానం చెప్పేసింది. తమవల్ల కాదంటూ క్యాడర్‌కు మోహం చాటేస్తున్నారు ఇంఛార్జ్‌లు. ప్రస్తుత పరిస్థితుల్లో జెండా కర్రలు ఇవ్వడమే పెద్ద విషయం అంటున్నారట పార్టీ నాయకులు.

అదేదో సామెత చెప్పినట్లు ఉంది టీడీపీలో పరిస్థితి. ఓ వైపు ఎన్నికల వ్యవహారంలో నిత్యం యుద్ధం చేస్తున్న టిడిపి…. అసలు ఎన్నికలు ఎదుర్కొనే విషయంలో మాత్రం తీవ్ర ఆందోళనలో ఉందట. దీనికి ఆర్థికపరమైన విషయాల్లో నేతల కలవరమే ప్రధాన కారణమట. నామినేషన్ల విషయంలోనే టిడిపి నేతలు నానా యాతన పడ్డారు. చాలాచోట్ల నేతలు ధైర్యం చేసి ముందుకు రాలేదు. కొందరైతే ఇప్పుడే ఎందుకు యుద్ధం అని సైడైపోయారట.

కిందా మీదా పడి టీడీపీ నామినేషన్లు వేసిన చోట మాత్రం పరిస్థితి మరోలా ఉందని చర్చ మొదలైంది. బరిలో ఉన్న అభ్యర్థులకు పార్టీ ఆర్థికంగా చేయూత ఇవ్వలేదని అధిష్ఠానం ముందే చెప్పేసింది. పార్టీ నుంచి సాయం అందబోదని నేతలు గ్రహించారు. దీంతో నియోజకవర్గం ఇంఛార్జ్‌లు, జిల్లా స్థాయి నేతలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చు భరించలేమంటున్నారట. ఎన్నికల్లో పెట్టిందే ఎలా అనుకుంటుంటే.. మళ్లీ డబ్బులు తియ్యడం అంటే చిన్న విషయం కాదని చెబుతున్నట్లు సమాచారం. మరికొన్ని చోట్ల డబ్బుల ప్రస్తావన లేకుండా నాయకులు మెనేజ్‌ చేస్తున్నారట. ఇంకొన్నిచోట్ల డబ్బులు అంటే చాలు తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల మధ్య స్థానిక ఎన్నికల కోసం డబ్బులు తీసినా గెలుపు ఖాయం కాదని.. ఒకవేళ గెలిచినా.. గెలుపొందిన వాళ్లు పార్టీలో ఉంటారో లేదో నమ్మకం కూడా లేదని కామెంట్లు చేస్తున్నారట. కేవలం గ్రామస్థాయి ఎన్నికల్లోనే కాదు.. విజయవాడ, గుంటూరు వంటి కార్పొరేషన్‌లలో కూడా టీడీపీ నేతలు ఇలాగే ఉందంటున్నారు. ప్రచారాలకు, ఇతర వ్యవహారాలకు అభ్యర్థులకు ఒక్క రూపాయి ఇచ్చే పరిస్థితి లేదట. దీంతో నామినేషన్లు వేసిన వారిలో చాలా మంది ఇతర పార్టీల ప్రలోభాలకు లోనయ్యే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది.

మొన్నటి వరకూ పదవుల్లో ఉండి.. ఆర్థికంగా బాగా ఆర్జించిన నేతలు సైతం ఇప్పుడు మా వల్ల కాదంటూ చేతులు ఎత్తేస్తున్నారట. అధికారంలో ఉన్న ఐదేళ్లూ కేడర్‌ను పట్టించుకోలేదు.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఆర్థిక సాయం కూడా చేయలేం అని అనడంపై కొందరు నిలదీస్తున్నారట. అధిష్ఠానం కొన్ని సూచనలు చేసినా.. జేబులో నుంచి రూపాయి తీసేది లేదని కరాఖండీగా చెప్పేస్తున్నారట. దీంతో నేతల తీరు చూస్తుంటే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహం మొత్తం చచ్చిపోతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి పార్టీ పెద్దలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news