కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి ఎంత కంచుకోట ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టిన జిల్లాగా ఉన్న ఈ జిల్లాలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోరమైన ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ నుంచి పోటీ చేసిన ముగ్గురు మంత్రులతో పాటు పలువురు కీలక నేతలు ఘోరంగా ఓడిపోయారు. జిల్లా నుంచి గన్నవరం లో వల్లభనేని వంశీ మోహన్, విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్, విజయవాడ ఎంపీ కేశినేని నాని మాత్రమే విజయం సాధించారు. గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక కేసులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన కొద్ది రోజులుగా టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.పార్టీ అధినేత చంద్రబాబు సమీక్ష.. సమావేశాలకు సైతం దూరంగా ఉన్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే వంశీ వైసీపీలోకి వెళతారన్న ప్రచారం జరిగినా ఆయన మాత్రం టీడీపీ నుంచే పోటీ చేసి వరుసగా రెండోసారి విజయం సాధించారు. గురువారం తన నియోజకవర్గ నేతలతో భేటీ అయిన ఆయన శుక్రవారం కేంద్ర మాజీ మంత్రి… తన సమీప బంధువు అయిన బిజెపి ఎంపీ సుజనాచౌదరితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
సుజనా చౌదరి గుంటూరు జిల్లాలో గాంధీ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నారు. అక్కడ సుజనాచౌదరితో సమావేశమైన వంశీ.. ఆయన కారులోనే ఒంగోలు వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. వీరిద్దరు గుంటూరులో కొద్ది సేపు చర్చలు జరిపిన అనంతరం ఒంగోలు వెళ్లడంతో వంశీ బిజెపి వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సుజనా చౌదరి బీజేపీలోకి వెళ్లినప్పుడే ఆయన వంశీని కూడా ఆహ్వానించారు. సుజనా వంశీకి గతంలోనే చాలాసార్లు సాయం చేసినట్టు కూడా వంశీ స్వయంగా చెప్పారు. అంతే కాదు వీరిద్దరు దగ్గర బంధువులు కూడా.
ఇప్పుడు వంశీ కేసుల్లో ఇరుక్కోవడంతో పాటు టీడీపీ అధిష్టానం గెలిచినా తమను కాదని.. ఉమా లాంటి వాళ్లకే ప్రయార్టీ ఇస్తుండడంతో వంశీ బాబు తీరుపై కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. ఇక సుజనా చౌదరి కూడా వంశీతో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేదని… బీజేపీలోకి వెళితే అన్ని విధాలా సేఫ్ అని వంశీకి వివరించినట్టు సమాచారం.