టికెట్ల కేటాయింపులో టీడీపీకి తలనొప్పులు…!

-

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అందులో భాగంగానే పాత మిత్రులు జనసేన, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు కూడా. తొలిసారి ఒంటరిగా పోటీ చేసిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. కేవలం 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. దీంతో మరోసారి అలాంటి ప్రయోగం చేసేందుకు చంద్రబాబు సాహసించలేదు. కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకున్నంత సుఖం లేదని చంద్రబాబు భావించారు. అందుకే గతంలో తిట్టిపోసిన బీజేపీతోనే తిరిగి పొత్తు పెట్టుకున్నారు. ఇదే ఇప్పుడు అధినేత చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది.

పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ల కాలంలో అండగా ఉన్న నేతలకు పొత్తుల కారణంగా అన్యాయం జరుగుతోందనే మాట బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకు టీడీపీలో చాలా మంది సీనియర్లు బయటకు రాలేదు కూడా. కానీ కార్యకర్తలకు కొందరు నేతలు అండగా నిలిచి భరోసా ఇచ్చారు. వీరికి సరైన గుర్తింపు ఇస్తానంటూ చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు. అయితే ఒంగోలు మహానాడు తర్వాత పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన సీనియర్లు మళ్లీ తెరపైకి వచ్చారు. తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో మాకే టికెట్ అని గొప్పగా ప్రకటించుకున్నారు కూడా. అయితే పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీ, జనసేనలకు కేటాయించారు. వీటిల్లో పలు నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్లకు మొండిచెయ్యి రానుంది.

అదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరే నేతలకు సైతం చంద్రబాబు టికెట్‌ హామీ ఇస్తున్నారు. అలాంటి వారి కోసం పార్టీలో కొందరు సీనియర్లను పక్కన పెట్టాల్సి వస్తోంది. ప్రధానంగా మైలవరం నియోజకవర్గం టికెట్‌ను సిట్టింగ్‌ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడ మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు మరో నేత రామారావు సైతం అధిష్ఠానంపై ఆగ్రహంతో ఉన్నారు. వీరిద్దరు పోటా పోటీగా యాత్రలు నిర్వహిస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గం టికెట్‌ను వేరొకరికి ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో అక్కడ ఇంఛార్జ్‌ బోడె ప్రసాద్‌ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని బెదిరిస్తున్నారు బోడె ప్రసాద్. ఉంగుటూరు నియోజకవర్గం టికెట్‌ను జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరందరిని ఇప్పుడు చంద్రబాబు బుజ్జగింజాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news