తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరూ కలిస్తే అసలు టీడీపీ నామ రూపాలు లేకుండా పోతుందని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురూ కలసి కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించడం సిగ్గు చేటని అన్నారు. ఇవాళ రోజా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్, కేసీఆర్ ఇద్దరూ కలిసి పనిచేస్తే టీడీపీ అడ్రస్ లేకుండా పోతుందని రోజా అన్నారు. చంద్రబాబు నాయుడు వైకాపాకు చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసినప్పుడు ఆయన ఎవరితో కుమ్మక్కయ్యారో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు విధానాలు నచ్చకపోవడం, మరోవైపు జగన్‌కు రోజూ రోజూ ప్రజా బలం పెరుగుతున్నందు వల్లే టీడీపీ నుంచి నేతలు పార్టీ మారి వైకాపాలోకి వస్తున్నారని రోజా అన్నారు.
చంద్రబాబుకు కులపిచ్చి పట్టుకుందని, ఆయన పార్టీకి చెందిన నేతలు దళితులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు తీరుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆమె అన్నారు. దళితులను టీడీపీ నేతలు అవమానిస్తున్నా.. చంద్రబాబు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రోజా ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు కూడా దళితులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని రోజా గుర్తు చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు బాటలో ఆయన పార్టీ నేతలు కూడా ప్రయాణిస్తున్నారని రోజా అన్నారు.
పుల్వామా ఘటనపై సీం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉగ్రవాదులకు మద్దతు పలికే విధంగా ఉన్నాయని రోజా విమర్శించారు. మోడీ రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేయడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని ఆమె అన్నారు. గతంలో గోదావరి పుష్కరాల్లో సీఎం చంద్రబాబు పర్యటన వల్ల 30 మంది చనిపోతే చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయలేదని రోజా ప్రశ్నించారు. ద్వంద్వ విధానాలు పాటిస్తున్న చంద్రబాబు తనకో నీతి, మరొకరికి మరో నీతి అన్నట్లుగా వ్యవహరించడం సిగ్గు చేటని రోజా ధ్వజమెత్తారు..!