నరేంద్ర మోడీ భారత దేశ ప్రధాన మంత్రిగా రెండోసారి అధికారం చేపట్టాక ఎన్నో సంస్కరణలు చేపడుతున్నారు. ట్రిఫుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు ఎవ్వరూ ఊహించని విధంగా జరిగాయి. ఈ సంస్కరణల పరంపరలో 2022 లో దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరుగుతాయన్న అంశం ప్రధానంగా చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని ఇప్పటికే పలు ప్రధాన పార్టీలు సైతం జమిలీ ఎన్నికలకు ఓకే చెప్పేశారు. ఇందుకు సంబంధించి రాజ్యంగ సవరణ చేస్తే 2022 లో జమిలి ఎన్నికలు జరగడం గ్యారెంటీయే. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజిత్ కుమార్ తాజాగా నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని బలపరిచేలా ఉన్నాయి.
తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ లో ఒకే రోజు పోలింగ్ నిర్వహిస్తామని.. దీనికి సంబంధించి ప్రధాన ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు చెప్పారు. రెండు చోట్లా వేర్వేరు తేదీల్లో ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఓటు వేసిన వారు.. ఆ తర్వాత ఏపీకి వెళ్లి ఓట్లు వేస్తున్నారని ఆయన చెప్పారు. ఇలాంటి బోగస్ ఓట్లను అరికట్టేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున పోలింగ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. బోగస్ ఓట్లకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ఈ ప్రతిపాదనను ఈసీ ముందు ఉంచినట్లు చెప్పారు.
ఇక తెలంగాణ ఎన్నికల సంఘం చేసిన ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలు ఏపీ కంటే ఐదారు నెలలు ముందే జరగాలి. కానీ జమిలీ ఎన్నికలు జరిగే ఛాన్సులు ఉండడంతో రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఒకే రోజు జరగటం ఖాయమన్న విషయం రజత్ కుమార్ మాటతో స్పష్టమైందని చెప్పాలి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ జరిగితే ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లి ఓట్లు వేసేవారు… తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి ఓట్లు వేసేవారికి బ్యాడ్ న్యూసే అవుతుంది. కనీసం రెండు, మూడు శాతం ఓట్లలో తేడా ఉండే అవకాశం ఉండడంతో అది కొన్ని నియోజకవర్గాల్లో తుది ఫలితాలను సైతం శాసిస్తుందనడంలో సందేహం లేదు.