తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో ఉన్నా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నానని.. కొన్ని విషయాలు బయటకు చెప్పలేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం రాజ్ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సమ్మక్క సారక్క యాత్రకు వెళ్లినపుడు హెలికాప్టర్ అడిగితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని గవర్నర్ అన్నారు. రాజ్‌భవన్‌కు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజ్‌భవన్ విషయంలో ఇక్కడి అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రిపబ్లిక్ వేడుకలకూ ఆహ్వానించలేదని.. శాసనసభలోనూ గవర్నర్ ప్రసంగాన్ని పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు ఏమైనా చర్చించి పరిష్కరించుకోవాలని హితవు పలికారు.
గవర్నర్ ప్రతి అంశాన్నీ ఒప్పుకోవాలనో..అన్నింటినీ పక్కన పెట్టాలనో అనుకోకూడదని చెప్పారు. రాజ్‌భవన్‌ను అవమానించారని.. ఓ మహిళా గవర్నర్‌ను అవమానించిన అంశం తెలంగాణ చరిత్ర పేజీల్లో నిలిచిపోతాయని అన్నారు.