తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉదయం 8 గంటలకు మొదలుకానుంది.దీనికోసం ఏపీలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అయితే జూన్ 1న ఏడో దశ లోక్‌సభ పోలింగ్ ముగియడంతో ప్రముఖ మీడియా సంస్థలు,సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేయడంతో కౌంటింగ్ పై ఆసక్తి నెలకొంది.గెలుపోటములపై అటు అభ్యర్థుల్లో కూడా ఉత్కంఠ కొనసాగుతోంది.కట్టుదిట్టమైన భద్రత నడుమ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
ఓ వైపు ఉత్కంఠ నడుస్తుండగా తొలి ఫలితం పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కొవ్వూరు లేదా నరసాపురం నియోజకవర్గాలలో వెలువడనుంది. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాల్లో కేవలం 13 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అన్నిటికన్నా ముందు ఈ రెండు నియోజకవర్గాల ఫలితాలు ముందుగా తెలిపోతాయి.ఒక్కో రౌండు పూర్తవడానికి గరిష్ఠంగా 20 నిమిషాల నుంచి 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి..ఈ రెండు ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం,చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గాల్లో మొత్తం 29 రౌండ్లలో ఓట్లు లెక్కించాల్సి ఉన్నందున అన్నింటికన్నా చివర ఈ రెండు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం జిల్లాలోని భీమిలి,కర్నూల్ జిల్లాలోని పాణ్యం నియోజకవర్గాల ఫలితా కోసం కూడా రాత్రి వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా 25 రౌండ్లు చొప్పున ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది.
ఓట్ల లెక్కింపు విధులకు హాజరయ్యే ఉద్యోగులు ఉదయం 4 గంటలకల్లా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 5 గంటలకు వారికి ఏయే టేబుళ్లు కేటాయించారన్న సమాచారం అందిస్తారు. ఆ తర్వాత ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా తొలుత ఆర్మీ సర్వీస్ ఉద్యోగుల ఓట్లు ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి మాములుగా అరగంట సమయం పడుతుంది.కానీ ఈసారి ఎక్కువమంది ఉద్యోగులు ఓటు వేశారు కనుక లెక్కింపు సమయం పెరిగే అవకాశం ఉంది.ఆ తర్వాత ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల ను తెరిచి ఓట్లు లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్లను సిద్ధం చేశారు.అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో వాటిని తెరిచి లెక్కిస్తారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా 111 నియోజకవర్గాల్లో 20కంటే తక్కువ రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను మధ్యాహ్నం 2 గంటల్లోగా పూర్తిచేయనున్నారు. మరో 60 నియోజకవర్గాల్లో 21 నుంచి 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఫలితాలు సాయంత్రానికి అందుబాటులోకి రానున్నాయి. మరో 4 నియోజకవర్గాలు మాత్రమే రాత్రి వరకు లెక్కింపు సాగనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 9 గంటల కల్లా మొత్తం ప్రక్రియ ముగించేలా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.