ఔనంటే కాదని, కాదంటే ఔనని మాట్లాడడం ఆడవారికే కాదు మన ముఖ్యమంత్రులకు, ప్రధాన మంత్రికి కూడా చేతనయిన పని అని తేలిపోయింది నిన్నటి వేళ. దేశ రాజధానిలో ఢిల్లీ పెద్దలతో స్నేహం మరియు సఖ్యత పెంచుకునే కేసీఆర్ ఉన్నపళాన కోపం అవుతున్నారు. ఆ విధంగా కోపం అవ్వడంతో తెలంగాణ ప్రజల మనస్సులు గెలుచుకోవచ్చన్నది ఆయన ఉద్దేశం. ఇంతకుముందు కూడా ఈ విధంగానే కోపం అయ్యారు.వాస్తవానికి ఆయన కోపానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి.
ఒకటి దేశ రాజధానిలో తనదైన రాజకీయాలు నడపలేకపోవడం.తెలంగాణలో వచ్చినంత పేరు మరో చోట ఆయనకు రాకపోవడం. అదేవిధంగా ప్రధాని కలకు మోడీ అడ్డు వస్తుండడం. ఈ మూడు కారణాల వలన కేసీఆర్ కోపం రాన్రానూ పెరిగిపోతోంది. ఆయన కోపం తగ్గాలంటే మోడీ తగ్గాలి లేదా మోడీ కి ఉన్న మానియా తగ్గాలి. అది ఇప్పటికిప్పుడు తగ్గేలా లేదు. మరోఐదేళ్లు కూడా మోడీనే పీఎం.
ఒప్పుకోవాలి గుజరాత్ నమూనా అంటే పెద్ద అబద్ధం అని! ఆయన మాత్రం మోసం అంటున్నారు. ప్రజలు నిజాలు చెబితే నమ్ముతారా లేదా మోసం చేస్తే దార్లోకి వస్తారా అంటే? రెండో పద్ధతికే నాయకులు ఓటేస్తారు. ఆ విధంగా ఆ రోజు గుజరాత్ మోడల్ అంటూ ఊదరగొట్టిన సందర్భంలో కేసీఆర్ పెద్దగా మాట్లాడలేదు. ఆ మాటకు వస్తే ఎవ్వరూ పెద్దగా గొంత్తెత్తలేదు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం దీర్ఘకాలిక ప్రయోజనాల్లో భాగంగా కేసీఆర్ ఫైర్ అవుతున్నారు.
ఇదంతా రాజకీయం కోసమే అనుకున్నా కొన్నివిషయాల్లో కేసీఆర్ ఇచ్చిన గణాంకాలు వాస్తవాలే! దేశంలో వసూలయ్యే పన్నుల వాటాలో తెలంగాణ వాటా అత్యంత కీలకం. ఆయన అన్న విధంగా దేశాన్ని ఆర్థిక ప్రగతి దిశగా నడిపిస్తున్నది తెలంగాణనే! అంతేకాదు ధాన్యం దిగుబడుల్లో కూడా తెలంగాణనే అగ్రభాగంలో ఉంది. అయినా కూడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం ఎక్కడా ఏ స్పష్టతా ఇవ్వడం లేదు అన్నది కేసీఆర్ బాధ. ఎలా చూసుకున్నా ఎంత కాదనుకున్నా కేసీఆర్ కారణంగా కొన్ని నిజాలు వెలుగు చూశాయి. కేంద్రం బడ్జెట్ కారణంగా మరోసారి తెలుగు రాష్ట్రాలపై వారికి ఉన్న వివక్ష ఏంటన్నది తేలిపోయింది.
అయితే కేసీఆర్ ఇప్పుడు కోపం అయినా ఢిల్లీకి వెళ్లినప్పుడు మాత్రం తన పంథా పూర్తిగా మార్చుకుంటారన్న ఆరోపణలూ ఉన్నాయి. తెలంగాణ భవన్ నిర్మాణం కోసం ఢిల్లీలో వసంత విహార్ లో అత్యంత ఖరీదైన స్థలం బీజేపీ నుంచి కేసీఆర్ కొట్టేశారని, కనుక కేసీఆర్ మాటలు అన్ని వేళలా నమ్మేందుకు వీల్లేదని ఇంకొందరు విపక్ష సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల్లో భాగంగానే సీఎం కేసీఆర్ ఆ విధంగా మాట్లాడుతున్నారని, అవన్నీ పైపై కోపాలే అని కొట్టిపారేస్తున్నాయి విపక్షాలు.