తిరుపతి ఉపఎన్నిక ప్రచారాం ముగిసినా పార్టీలకు అసలు సవాల్ అదే

-

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం పోలింగ్‌ జరగబోతోంది. గెలుపుపై అన్నిరాజకీయపార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే కరోనా కోరలు చాస్తున్నా వేళ ఉపఎన్నికలో ఓటర్ల అటెన్షన్‌ తీసుకురావడం ఇప్పుడు పార్టీలకు పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు వారిని పోలింగ్‌ బూత్‌ల వరకు తీసుకెళ్లడం పై టెన్షన్ పడుతున్నాయి. ఆశించిన మేరకు ఓటింగ్‌ జరగకపోతే రేస్‌లో నెగ్గుకు రావడం కష్టమని భావిస్తున్న పార్టీలు ఓటింగ్‌ పెరిగితే ఎవరికి లాభం.. తగ్గితే ఎవరికి నష్టం అని లెక్కలేస్తున్నయి.


తిరుపతి లోక్‌సభ పరిధిలో 16 లక్షల 89 వేల 934 మంది ఓటర్లు ఉన్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు 30 మంది. 2019 ఎన్నికల్లో 78 శాతం పోలింగ్‌ జరిగింది. ఈ పోలింగ్‌ శాతాన్ని పెంచాలనే యోచనలో ఉన్నాయి పార్టీలు. కరోనా వల్ల ఓటింగ్‌ 78 శాతమైనా రీచ్‌ అవుతుందా.. ఇంకా తగ్గుతుందా అన్న ఆందోళన నెలకొందట. ఆ ఎన్నికల్లో 16 లక్షలకు పైగా ఓట్లు ఉండగా.. 12 లక్షల ఓట్లు పోలయ్యాయి. అప్పటికి ఇప్పటికీ ఓవరాల్‌గా 40 వేల మంది ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. కరోనా భయాన్ని పక్కనపెట్టి మరోసారి 12 లక్షల మంది ఓటర్లు పోలింగ్‌ బూత్‌ల దగ్గరకు వస్తారా? అలా కాకుండా 10 లక్షలలోపే పోలింగ్‌ నమోదైతే పరిస్థితి ఏంటి అన్న లెక్కలపై ప్రస్తుతం కుస్తీ పడుతున్నారు నాయకులు.

గెలుపుపై ధీమాగా ఉన్న వైసీపీ.. 5 లక్షల మెజారిటీపై కన్నేసింది. ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు టార్గెట్లు ఫిక్స్‌ చేశారు. 2019 ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన టీడీపీ.. ఈసారి రేస్‌లో ముందుకు రావాలని చూస్తోంది. ఈ రెండు పార్టీలను కాదని తమకు పట్టం కట్టాలని కోరుతోంది బీజేపీ. జనసేనతో కలిసి కమలనాథులు ఎన్నికల ప్రణాళికలు వేస్తున్నారు. మెజారిటీతోపాటు పోలింగ్‌ శాతంపై ఇన్నాళ్లూ కొన్ని అంచనాలు వేసుకున్న పార్టీలకు ఇప్పుడు కొత్త టెన్షన్‌ పట్టుకుంది. పోలింగ్‌ను కరోనా ప్రభావితం చేస్తుందా ఓటర్లు ధైర్యంగా వచ్చి ఓటు వేస్తారా అన్న చర్చ జరుగుతోంది.

2019 ఎన్నికల్లో వైసీపీకి 7 లక్షల 22 వేల పైచిలుకు ఓట్లు, టీడీపీకి 4 లక్షల 94 వేల ఓట్లు వచ్చాయి. నాడు వైసీపీకి వచ్చిన మెజారిటీ 2 లక్షల 28 వేలు. ఇప్పుడు ఉపఎన్నికలో ఈ మెజారిటీని డబుల్ చేయాలన్నది అధికారపార్టీ వ్యూహం. వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో పని చేస్తున్నారు. ఆయా సెగ్మంట్లలో గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ తీసుకురావాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. ఈ విషయంలో వారెంత వరకు సక్సెస్‌ అవుతారో కరోనా వల్ల అంచనా వేయలేకపోతున్నారట. పోలింగ్ 55 నుంచి 60 శాతానికి పరిమితమైతే మెజార్టీ మూడు, మూడున్నర లక్షలకు దాటదని వైసీపీ నేతలు అనుకుంటున్నారట.

సాధారణంగా ఉపఎన్నికలో ఓటింగ్‌ శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకతగా విపక్షాలు ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. తక్కువ పోలింగ్‌ జరిగితే.. ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందుతున్నవాళ్లు కృతజ్ఞతగా ఓటేశారని అనుకోవచ్చు. ఇప్పుడు కరోనా వల్ల ఏం జరిగినా గతంలోలా అంచనాలకు రాలేని పరిస్థితి. ఓటింగ్‌ తగ్గడం వల్ల కలిగే నష్టంపై టీడీపీ శిబిరంలో ఎక్కువ చర్చ జరుగుతోందట. ఇటు చూస్తే.. కరోనా ఉధృతి వల్ల సీఎం జగన్‌ తన పర్యటనను కూడా విరమించుకున్నారు. బీజేపీ నుంచి జేపీ నడ్డా మినహా అమిత్‌షా, యోగి ఆదిత్యలాంటివాళ్లు ప్రచారానికి రాలేదు. కారణం ఏదైనా.. ఈ ప్రతికూల పరిస్థితుల్లో జనం మూడ్‌ ఏంటో పార్టీలకు అంతుచిక్కడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news