దుబ్బాక దెబ్బ అబ్బా అనిపించిందా ? అన్నీ ఫ్రీ అంటున్న టీఆర్ఎస్ ?

-

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ను గ్రేటర్ ఎన్నికలు గడగడలాడిస్తున్నాయి. మొన్నటి వరకు ఇక్కడ తమదే విజయం అని ఆ పార్టీ నేతలు ధీమా లో ఉండగా, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించకపోవడం, ఎక్కడికక్కడ ప్రజావ్యతిరేకత కనిపిస్తూ ఉండటంతో, ఎన్నికల ఫలితాలు గ్రేటర్ లో రిపీట్ అవుతాయేమో అనే ఆందోళన అధికార పార్టీలో కనిపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే పార్టీలోని కొంత మంది అసంతృప్తి నేతలు బిజెపి  బాట పడుతూ ఉండడం వంటి వ్యవహారాలు టిఆర్ఎస్ ను కలవర పెడుతున్నాయి. దీనికి తోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టిఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తూ ఉండడం వంటి వ్యవహారాలతో గెలుపు పై ఇప్పుడు ఎక్కడ లేని డౌట్ టిఆర్ఎస్ కు వచ్చేసినట్టు గా కనిపిస్తోంది.
గ్రేటర్ లో బీజేపీ ప్రభావం కాస్తోకూస్తో ఉంటుందని మొదటి నుంచి అంచనా వేసినా, ఇప్పుడు ఆకస్మాత్తుగా ఇంత బలం పుంజుకుంటుందని  ఊహించలేకపోయారు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ లో గట్టెక్కేందుకు గతంలో ఎప్పుడూ లేనివిధంగా మేనిఫెస్టో పేరుతో వరాల జల్లు కురిపించారు. అందులో ముఖ్యమైనవి … రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల లోని కార్పొరేషన్ లోనూ ఉచితంగా మంచినీటి సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే 20 వేల లీటర్ల లోపు ఉన్న నీటిని సరఫరా చేసేందుకు ఆయన హామీ ఇచ్చారు. అలాగే నాయి బ్రాహ్మణులకు ప్రయోజనం కలిగించే విధంగా, గ్రేటర్ హైదరాబాద్ తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సెలూన్ల కు ఉచితంగా విద్యుత్ ను అందించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.
దీనిని డిసెంబర్ 2వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా క్రియాశీలకంగా పనిచేస్తున్న దోబీ ఘాట్ లకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. లాండ్రీ లకు ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తామని కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రకటించారు. అలాగే లాక్ డౌన్ సమయంలో మోటారు వాహనాలకు సంబంధించిన మోటార్ వాహన పన్ను ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే గ్రేటర్ పరిధిలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,37,611 ట్రాన్స్పోర్ట్ వాహనాలకు సంబంధించిన పనులను మానవతా దృక్పథంతో మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఈ విధంగా టిఆర్ఎస్ మేనిఫెస్టో లో ఇన్ని పథకాలను ప్రవేశపెట్టడం చూస్తుంటే, గెలుపుపై ఆ పార్టీకి ఏ స్థాయిలో సందేహం ఉంది అనే విషయం స్పష్టంగా అర్థం అవుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news