షర్మిల, రేవంత్‌లని లైట్ తీసుకుంటున్నారా?

తెలంగాణ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికార టీఆర్ఎస్‌కు ధీటుగా ప్రతిపక్షాలు పోటీ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. కొన్ని నెలల ముందు వరకు తెలంగాణలో ప్రతిపక్షాలకు పెద్ద సీన్ లేదని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. టీఆర్ఎస్‌కు ధీటుగా ఆ పార్టీ వచ్చింది. అలాగే కాంగ్రెస్ పని అయిపోతుందనే పరిస్తితుల్లో రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు తీసుకుని, దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. బలమైన క్యాడర్ ఉన్న కాంగ్రెస్ సైతం టీఆర్ఎస్‌కు పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది.ఇలా ప్రతిపక్షాలు అధికార టీఆర్ఎస్‌పై రాజకీయ దాడి మొదలుపెట్టిన సమయంలోనే, దివంగత వైఎస్సార్ తనయురాలు షర్మిల, తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్సార్ తెలంగాణ పేరిట పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఆమె కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు.

ys-sharmila-revanth-reddy

అలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ మాత్రం ప్రధాన ప్రత్యర్ధిగా బీజేపీని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఆ పార్టీనే టార్గెట్ చేసి ముందుకెళుతుంది. తాజాగా కేటీఆర్ సైతం, బీజేపీపైనే ఎక్కువగా విమర్శలు చేశారు. ఈటల రాజేందర్ వ్యవహారంపై స్పందించిన కేటీఆర్, ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇంకా బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రపై కూడా కామెంట్లు చేశారు.

చిల్లర రాజకీయాలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా బీజేపీ మారిందని మాట్లాడిన కేటీఆర్, ఈ మధ్య రాష్ట్రంలో మిగతా పార్టీల నాయకత్వాలు మారాయని, కొత్తలో వారికి జోష్‌ ఉంటుందని, ఉనికి కోసం ఏదో మాట్లాడుతుంటారని, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే విధంగా కేటీఆర్ మాట్లాడారు. అలాగే రేవంత్‌రెడ్డిది కొత్త మురిపెమని, షర్మిల నిరుద్యోగ దీక్ష ప్రతి మంగళవారం చేసే వ్రతం లాంటిదని ఎద్దేవా చేశారు. అంటే రేవంత్, షర్మిలని కేటీఆర్ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. కానీ వారిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.