అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. ట్విటర్ వేదికగా సీఎంను లోకేశ్ నిలదీశారు. ఆకాశమే హద్దుగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దూసుకెళ్తున్నాయని లోకేశ్ మండిపడ్డారు. ఇండియన్ పెట్రోల్ లీగ్‌లో రికార్డుల మోత మోగిస్తూ పెట్రోల్ ధరను రూ.108, డీజిల్ ధరను రూ.100 చేసి బాదుడు రెడ్డి అనే పేరుని సార్ధకం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. రక్తం పీల్చే జలగకన్నా దారుణంగా జగన్ ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
31 శాతం వ్యాట్+లీటర్‌కు రూ.4 అదనపు వ్యాట్+లీటర్‌కు రూ.1 రోడ్డు అభివృద్ధి సుంకం అన్నీ వెరసి ప్రజలపై బాదుడు రెడ్డి భారం లీటర్‌కు 30 రూపాయిలు చేరిందని లోకేశ్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం పన్నులు తగ్గించుకుంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ఇవ్వొచ్చని నీతి కబుర్లు చెప్పిన బాదుడు రెడ్డి ఇప్పుడు పన్నులు ఎందుకు తగ్గించడం లేదన్నారు. ఇతర రాష్ట్రాల పెట్రోల్ బంకుల్లో ఏపీ కంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ అంటూ బోర్డులు పెట్టారంటే తమ దోపిడీ ఏ రేంజ్‌లో ఉందో అర్ధమవుతుందని ఎద్దేవా చేశారు.. ఇప్పటికైనా రాష్ట్ర పన్నుల భారాన్ని తగ్గించి తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ అందించాలని లోకేశ్ సూచించారు.
ఇప్పటికైనా ప్రతిపక్షంలో అన్న మాటకు కట్టుబడి రాష్ట్ర పన్నుల భారాన్ని తగ్గించి తక్కువ ధరకు పెట్రోల్,డీజిల్ అందించాలి.(4/4)
— Lokesh Nara (@naralokesh) July 17, 2021