హుజూరాబాద్‌లో ఊహించని ట్విస్ట్…కారు పార్టీలో ఏం జరుగుతుంది?

హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలని అధికార టి‌ఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా షెడ్యూల్ రాకముందే హుజూరాబాద్‌లో టి‌ఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు మకాం వేసి కారు గుర్తుకి ఓటు వేయాలని తిరుగుతున్నారు. అటు సి‌ఎం కే‌సి‌ఆర్ సైతం హుజూరాబాద్‌పై స్పెషన్ ఫోకస్ చేసి, రాజకీయం చేస్తున్నారు. ఊహించని రీతిలో హుజూరాబాద్‌కు వరాలు ఇస్తున్నారు. అటు మంత్రి హరీష్ రావు హుజూరాబాద్‌లో పార్టీ గెలుపుని తన భుజాలపై పెట్టుకుని ముందుకెళుతున్నారు.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

టి‌ఆర్‌ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని వెంటబెట్టుకుని హుజూరాబాద్ అంతా తిరుగుతున్నారు. కానీ ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడే ఊహించని ట్విస్ట్ వచ్చి పడింది. హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డి సెపరేట్‌గా ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది. మొన్నటివరకు కాంగ్రెస్‌లో ఉన్న కౌశిక్ రెడ్డి, కే‌సి‌ఆర్ టి‌ఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పార్టీ గెలుపు కోసం కౌశిక్‌ని టి‌ఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చారు.

అయితే కౌశిక్ రెడ్డి టి‌ఆర్‌ఎస్ తరుపున బరిలో దిగుతారని అంతా అనుకున్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గెల్లు శ్రీనివాస్‌కు కే‌సి‌ఆర్ టికెట్ ఇచ్చారు. పైగా బి‌సి వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టొచ్చని అనుకున్నారు. అలాగే కౌశిక్‌కు ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ కౌశిక్ మాత్రం హుజూరాబాద్‌లో తనకంటూ సెపరేట్ ప్రచార రథాలని ఏర్పాటు చేసుకుని టి‌ఆర్‌ఎస్‌ని గెలిపించాలని తిరుగుతున్నారు.

ఇక ఆ ప్రచార రథాలపై ‘కౌశిక్ నాయకత్వం వర్ధిల్లాలి, కారు గుర్తుకే ఓటు, కౌశిక్ అన్న విజయం తథ్యం’ అనే నినాదాలు ఉన్నాయి. పైగా కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో సెపరేట్‌గా సమావేశాలు పెడుతూ ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. గెల్లు శ్రీనివాస్ సొంత వూరు హిమ్మత్ నగర్‌లో కూడా కౌశిక్ సెపరేట్ మీటింగ్ పెట్టుకున్నారని సమాచారం. ఇలా తానే అభ్యర్ధి అనే రీతిలో కౌశిక్ ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో హుజూరాబాద్ టి‌ఆర్‌ఎస్ అభ్యర్ధి ఎవరు అనే అంశంపై సొంత క్యాడర్‌లోనే కన్ఫ్యూజన్ మొదలైనట్లు కనబడుతోంది. మరి కౌశిక్ వ్యవహారంపై టి‌ఆర్‌ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.