ఎస్ ఈ టైటిల్ ఇప్పుడు నూటికి నూరు శాతం నిజం. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 20 రోజుల టైం ఉంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులోనే తప్పటడుగులు వేస్తోంది. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు కాంగ్రెస్‌కు ఉన్నా క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. అయితే ఇప్పటికే ప్రతి జిల్లాలో చాలామంది నేతలు పార్టీ గెలిచేస్తుంది.. తమకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందంటూ ఊహల్లో మునిగితేలుతున్నారు. అందుకే పలువురు సీనియర్లు ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని టిక్కెట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక పార్టీలో ఎప్పటినుంచో ఉన్న నేతలకే మంత్రి పదవిపై ఆకాశంలో ఆశలు ఉంటే.. నిన్నగాక మొన్న పార్టీ మారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరు నేతలు ఇంకా ఎన్నికల్లో గెలవనే లేదు.. అప్పుడే మాకు మంత్రి పదవి.. మాకు మంత్రి పదవి అని అంతర్గతంగా ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్న పరిస్థితి. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు ? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకుని కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నిన్న మొన్నటి వరకు వీరిద్దరూ బిఆర్ఎస్ లోనే ఉన్నారు.
అలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో లేదో కాంగ్రెస్ అధిష్టానం తుమ్మలకు ఖమ్మం, పొంగులేటికి పాలేరు అసెంబ్లీ టికెట్లు కేటాయించింది. తుమ్మల మాజీ మంత్రి గతంలో టిడిపి – బీఆర్ఎస్ లో మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని తుమ్మలతో పాటు ఆయన అనుచరులు అప్పుడే ప్రచారం ప్రారంభించేశారు. ఇక పొంగులేటి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచార కోకన్వీనర్ గాను ఉన్నారు. పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది మంది టిఆర్ఎస్ అభ్యర్థులను ఓడించే బాధ్యత నాది అంటూ ఆయన ఇప్పటి నుంచే ప్రచారం చేసుకుంటున్నారు.
అందుకే పొంగులేటి తనకు మంత్రి పదవి ఖాయం అన్న ధీమాతో ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఇటు ఖమ్మం.. అటు పాలేరు రెండు నియోజకవర్గాల్లో తుమ్మలకు, పొంగులేటికి ఇద్దరికీ కొద్దిమంది అనుచరులు ఉన్నారు. ఈ అనుచరులు కూడా మానేతకే మంత్రి పదవి అని చెప్పుకుంటూ రెండో వ్యక్తికి పూర్తిగా సహకరిస్తున్న పరిస్థితి అయితే లేదు. పాలేరులో తుమ్మల వర్గం పొంగులేటి ఓడితే తుమ్మలకు మంత్రి పదవి వచ్చే విషయంలో పోటీ ఉండదని గుసగుసలాడుకుంటుంది.
ఇటు ఖమ్మంలో ఉన్న పొంగులేటి వర్గం తుమ్మల ఓడితే పొంగులేటికి మంత్రి పదవి ఖాయం అన్న ధీమాతో ఉంది. ఏది ఏమైనా వీరు ఇప్పుడే ఆశల పల్లకిలో మునిగితేలుతున్న క్రమంలో తుమ్మలకు పువ్వాడ రూపంలో బలమైన అభ్యర్థి… ఇటు పాలేరులో పొంగులేటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి రూపంలో స్ట్రాంగ్ అభ్యర్థి పోటీలో ఉన్నారు. అసలు ముందు వీళ్ళు ఎంతవరకు ? గెలుస్తారు అంటే ఇద్దరు డౌట్‌లోనే ఉన్నారు. అయినా మంత్రి పదవి మాకే మాకే అంటు పోటీకి దిగడం కామెడీగా మారింది.