ఉప్పల్ చిచ్చు..కారులో అలజడి.!

-

బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఇంకా రచ్చ నడుస్తూనే ఉంది. ఎక్కువ మంది సిట్టింగులని మార్చకపోయిన..మార్చిన స్థానాల్లో రచ్చ నడుస్తోంది. అలాగే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడంపై కూడా బి‌ఆర్‌ఎస్ లో చిచ్చు రగులుతుంది. ఇదే క్రమంలో ఉప్పల్ బి‌ఆర్‌ఎస్ పార్టీలో పెద్ద రచ్చ నడుస్తోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిని కాదని, కాంగ్రెస్ నుంచి వచ్చిన బండారి లక్ష్మారెడ్డికి సీటు ఇవ్వడంపై పెద్ద పోరు జరుగుతుంది.

ఇటీవలే కే‌సి‌ఆర్..115 మందితో అభ్యర్ధులని ప్రకటించారు. ఈ క్రమంలో ఉప్పల్ లో బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధిగా లక్ష్మారెడ్డిని ప్రకటించారు. దీనిపై బి‌ఆర్‌ఎస్ లో మొదట నుంచి వచ్చిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అసంతృప్తిలో ఉన్నారు. వాస్తవానికి ఉప్పల్ లో భేతి, బొంతుల మధ్య ఎప్పటినుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇక వీరిద్దరిలో ఒకరికి సీటు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా వీరిద్దరిని కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన లక్ష్మారెడ్డికి కే‌సి‌ఆర్ సీటు ఇచ్చారు. దీంతో భేతి అసంతృప్తితో ఉన్నారు.

వారం రోజుల్లో ఉప్పల్ టికెట్‌పై పునరాలోచన చేయకుంటే కచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని బి‌ఆర్‌ఎస్ అధిష్టానానికి భేతి ఆల్టిమేటం ఇచ్చారు. 2001 పార్టీ ఆవిర్భావం నుంచి తాను ఉప్పల్‌లో గులాబీ జెండా పట్టినా అని, నియోజకవర్గంలో పార్టీని కాపాడినా… 2009లో టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేసినా. నాపై కేసులు పెట్టినా భయపడకుండా ముళ్ల బాటలో నడిచినా. 2014లో ఇప్పుడు టికెట్ దక్కిన వ్యక్తికి డిపాజిట్ రాలేదు. ఆ ఎన్నికల్లో నాకు 60వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. 2018లో నేను 48వేల ఓట్ల మెజారిటీతో గెలిచినా.” అంటూ భేతి చెప్పుకొచ్చారు.

 

ఉరి తీసే వారికి కూడా చివరి కోరిక అడుగుతారని, కానీ తనకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదని అన్నారు. మొత్తానికి కే‌సి‌ఆర్‌ని కలిశాక తన కార్యాచరణ ప్రకటిస్తానని భేతి చెప్పుకొచ్చారు. అయితే భేతి..2014లో బి‌ఆర్‌ఎస్ నుంచి ఉప్పల్ లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి లక్ష్మారెడ్డి పోటీ చేసి 34 వేల ఓట్లు తెచ్చుకుని మూడోస్థానంలో నిలిచారు. 2018లో పొత్తులో కాంగ్రెస్, టి‌డి‌పికి ఉప్పల్ సీటు ఇచ్చింది. దీంతో అక్కడ లక్ష్మారెడ్డి పోటీ చేయడానికి కుదరలేదు.

టి‌డి‌పి నుంచి వీరేంద్ర గౌడ్ పోటీ చేశారు. ఇక బి‌ఆర్‌ఎస్ నుంచి భేతి పోటీ చేసి 48 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక తర్వాత లక్ష్మారెడ్డి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఇప్పుడు భేతిని కాదని లక్ష్మారెడ్డికి సీటు ఇచ్చారు. మరి  భేతి బి‌ఆర్‌ఎస్ లో ఉంటారో జంప్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news