ఇటీవల టిటిడికి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ పై టిడిపి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు శ్రీవాణి ట్రస్ట్ కొత్తగా ఎందుకు పెట్టారు? అందులోకి శ్రీవారి నిధులు ఎందుకు తరలిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు చెస్తున్నారు. అక్కడ నిధులు గోల్ మాల్ జరుగుతున్నాయని, దేవుడు నిధులు తాడేపల్లి ప్యాలెస్‌కు వస్తున్నాయని ఆరోపణలు చెస్తున్నారు.
ఈ క్రమంలోనే టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి…శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేశారు. అయితే శ్రీవాణి ట్రస్ట్ శ్వేతపత్రంలో లెక్కలు తప్పుల తడకలుగా ఉన్నాయని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. తాజా లెక్కల్లో వందల కోట్ల తేడా వస్తోందని, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒక్కో టికెట్టు రూ.10వేల వంతున రోజుకు వెయ్యి టికెట్లు విక్రయిస్తున్నామని టీటీడీ గతంలో చెప్పిందని, ఈ లెక్కన ఇప్పటికి రూ. 1,500 కోట్లు రావాలని, కానీ టీటీడీ చైర్మన్ మాత్రం రూ.860 కోట్లు వచ్చాయని చెబుతున్నారని, మిగిలిన సొమ్ము ఎటు పోయింది? తాడేపల్లిలోని జగన్ దేవస్థానానికి పంపారా.. అన్న అనుమానం వస్తోందని అన్నారు.
అయితే టిడిపి చేసే విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. శ్రీవాణి ట్రస్టు ప్రవేశపెట్టడం ద్వారా టీటీడీ దళారీ వ్యవస్థని రూపుమాపిందని, శ్రీవాణి ట్రస్టు నిధులు మళ్లిస్తున్నారంటూ పవన్ కల్యాణ్, చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తూ శ్రీవారితో చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. భక్తుల్లో అపోహలను సృష్టించేందుకే పవన్, చంద్రబాబు ఆరోపణలు చేశారని, టీటీడీలో నిధులు మళ్లీంపు సాధ్యం కాదని అన్నారు.
గతంలో చంద్రబాబుపై అలిపిరిలో ఏమి జరిగిందో అందరికీ తెలుసని.. సీఎం పదవిని కూడా పొగట్టుకున్నాడని, రాబోవు రోజుల్లో చంద్రబాబు తిరుమలకి వచ్చే పరిస్థితి ఉండదని వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.