వైకాపా అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందిస్తాం: వైఎస్ జ‌గ‌న్

-

సీఎం చంద్ర‌బాబు ఎంత సేపు త‌న స్వ‌లాభం కోస‌మే య‌త్నిస్తూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను, ప్ర‌జ‌ల అభిమ‌తాన్ని ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. త‌న‌పై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పెట్టిన కేసులు నిల‌బ‌డ‌లేవ‌ని జ‌గ‌న్ అన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అన్యాయం చేశాయ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ అన్నారు. ఓ ప్ర‌ముఖ జాతీయ మీడియా చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ మాట్లాడుతూ చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జ‌ల అభీష్టాన్ని తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింద‌న్నారు. ఆ త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పి మాట మార్చింద‌ని, ఈ ర‌కంగా ఆ రెండు పార్టీలు ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయ‌ని జ‌గ‌న్ అన్నారు.

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట తాను ఏపీలో పాద‌యాత్ర చేస్తూ ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌గా వెళ్లి వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా అడిగి తెలుసుకున్నాన‌ని జ‌గ‌న్ అన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే… గ్రామాల్లో ఎక్క‌డిక‌క్క‌డే స‌మావేశాలు నిర్వ‌హించి స‌మ‌స్య‌ల‌ను అక్క‌డే ప‌రిష్క‌రిస్తామ‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డ‌మే త‌మ ధ్యేయ‌మ‌ని, త‌మ పాల‌న‌లో చేప‌ట్టే సంక్షేమ కార్య‌క్ర‌మాలు, అందుబాటులోకి తెచ్చే సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌లు చిర‌కాలం గుర్తుంచుకుంటార‌న్నారు.

ఏపీని విభ‌జించాక కొత్త ఏపీలో అనేక స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని జ‌గ‌న్ అన్నారు. రైతుల‌కు రుణ మాఫీ చేస్తామ‌ని 2014లో టీడీపీ త‌ప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చింద‌ని, కానీ రైతుల‌కు రుణ మాఫీ జ‌ర‌గ‌లేద‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. రుణ‌మాఫీ చేయ‌లేమ‌ని తెలిసినా టీడీపీ రైతుల‌కు మాయ‌మాట‌లు చెప్పి మోసం చేసింద‌న్నారు. 2014లో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ గ‌డిచిన నాలుగున్న‌ర ఏళ్ల‌లో ఏనాడూ రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని, వారి స‌మ‌స్య‌ల‌ను సీఎం చంద్ర‌బాబు స‌ర్కారు గాలికొదిలేసింద‌న్నారు.

స‌మాజంలో ఉన్న కేవ‌లం ఒక వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే మేలు చేసేలా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని జ‌గ‌న్ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వ‌స్తే కుల‌, మ‌త‌, వ‌ర్గ భేదాలు లేకుండా అన్ని వ‌ర్గాల వారికి స‌మ‌న్యాయం చేస్తామ‌ని అన్నారు. అలాగే తాము ప్ర‌క‌టించిన న‌వ‌రత్నాల‌ను కచ్చితంగా అమ‌లు చేసి తీరుతామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌త్యేక హోదా అంశంపై జ‌గ‌న్ మాట్లాడుతూ.. బీజేపీ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పి తీరా అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌ల‌ను మోసం చేసిందని అన్నారు. ప్ర‌త్యేక హోదా వ‌స్తే ప‌రిశ్ర‌మలు రాష్ట్రానికి త‌ర‌లివ‌స్తాయ‌ని, స్థానిక యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని జ‌గ‌న్ తెలిపారు.

మోడీ, రాహుల్ గాంధీ ఇద్ద‌రూ దొందు దొందే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. రెండు పార్టీలు ఏపీ ప్ర‌జ‌లకు తీర‌ని అన్యాయం చేశాయ‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. పార్ల‌మెంట్ సాక్షిగా ఏపీకి ప్ర‌త్యేక హోదా క‌ల్పిస్తామ‌ని మాట‌లు చెప్పి ఇప్పుడు మాట తప్పార‌ని జ‌గ‌న్ అన్నారు. పార్ల‌మెంట్ మీద న‌మ్మ‌కం పెర‌గాలంటే ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవాల‌ని, వెంట‌నే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని అన్నారు. రాబోయే ఎన్నిక‌ల అనంతరం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే పార్టీతోనే తాము పొత్తు పెట్టుకుంటామ‌ని, ఆ పార్టీకే తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

ఏపీ రాజధాని ఫ‌లానా ప్రాంతంలో వ‌స్తుంద‌ని ముందుగానే తెలుసుకున్న సీఎం చంద్ర‌బాబు అక్క‌డి రైతుల నుంచి భూముల‌ను బినామీల ద్వారా త‌క్కువ ధ‌ర‌కే కొనుగోలు చేసి ముఖ్య‌మంత్రి ప‌ద‌వికే క‌ళంకం తీసుకువ‌చ్చార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. సీఎం చంద్ర‌బాబు ఎంత సేపు త‌న స్వ‌లాభం కోస‌మే య‌త్నిస్తూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను, ప్ర‌జ‌ల అభిమ‌తాన్ని ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. త‌న‌పై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పెట్టిన కేసులు నిల‌బ‌డ‌లేవ‌ని జ‌గ‌న్ అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్ర‌బాబు త‌న‌పై ఉన్న కేసుల గురించి మాట్లాడ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

గ‌తేడాది జూన్‌లో కాంగ్రెస్ పార్టీ చంద్ర‌బాబు అవినీతిపై ఓ పుస్త‌కాన్ని విడుద‌ల చేసింద‌ని, కానీ అదే పార్టీ త‌రువాత టీడీపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి దారుణంగా ఓడిపోయింద‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మ‌రోసారి కాంగ్రెస్‌, టీడీపీలు పొత్తుల డ్రామాతో ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తున్నాయ‌ని, అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు దాన్ని గ‌మ‌నిస్తున్నార‌ని, దిగజారుడు రాజ‌కీయాలు చేసే పార్టీల‌కు ప్ర‌జ‌లు గ‌ట్టిగా బుద్ధి చెబుతార‌ని జ‌గ‌న్ అన్నారు. ఇక రానున్న ఎన్నిక‌ల్లో తాము ఏపీలో భారీగా అసెంబ్లీ స్థానాల‌ను కైవసం చేసుకుని అధికారంలోకి వస్తామ‌ని జ‌గ‌న్ ధీమా వ్య‌క్తం చేశారు..!

Read more RELATED
Recommended to you

Latest news