జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రాజకీయ గమ్యం ఎటు వైపు ఉంటుంది.. అసలు పవన్ పార్టీలో చివరకు పవన్ తప్ప ఎవ్వరు మిగలరా..? పవన్ పార్టీని నడుపుతారా ? మూసేస్తారా ? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు అటు కాంగ్రెస్ నుంచి – మరోవైపు తెలుగుదేశం నుంచి అనేక మంది వచ్చి చేరారు. అయితే పవన్ మాత్రం కాపు రాజకీయ నేతల్లో కూడా ఎవరిలోనూ నమ్మకాన్ని కలిగించలేకపోయారు. ఇక ఎన్నికల్లో సాధించిన ఫలితాలు ఎంత ఘోరంగా ఉన్నాయో చూశాం.
పార్టీ అధ్యక్షుడి హోదాలో స్వయంగా పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. జనసేన కీలక నేతలుగా ఉన్న మాజీ జేడీ వీ లక్ష్మినారాయణ – నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ల పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. కనీసం ఉనికి చాటలేకపోయింది జనసేన. ఒక్క రాజోలులో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు సొంత ఇమేజ్‌తో గెలిచాడు. ఇక ఎన్నికల తర్వాత అయినా పవన్ మారతాడు ? అనుకుంటే అదీ లేదు. కేవలం జగన్‌ను విమర్శించడం అనే ఏకైక ఎజెండాతో మాత్రమే పవన్ ముందుకు వెళుతున్నట్టు అందరికి అర్థమైంది.
నువ్వు ఎలా ? సీఎం అవుతావో చూస్తా జగన్ అంటూ సవాళ్లు రువ్విన పవన్ ఆ ప్రశ్నలోనే కేవలం జగన్‌ను మాత్రమే టార్గెట్‌గా చేసుకున్నాడని తెలిసిపోయింది. కానీ వాస్తవంగా ప్రజలు అనుకుంటే ఎవరైనా సీఎం అవుతారన్న విషయం పవన్ ఇప్పటకీ తెలుసుకోలేక పోవడం దురదృష్టం. ఇక ఎన్నికలకు ముందు… ఆ తర్వత కూడా పవన్ ఎజెండా.. కేవలం జగన్‌ను టార్గెట్ చేయడమే అన్న విషయం అందరికి అర్థమైంది. దీంతో ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.
ఇక ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసిన నేతల్లో పదుల సంఖ్యలో బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వస్తోన్న వారందరు పవన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ వెంట ఆయన వీరాభిమానులు తప్ప ఎవ్వరూ ఉండే పరిస్థితి లేదు. పవన్ ఇప్పటకీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే విషయంలో ఎంత మాత్రం కాన్సంట్రేషన్ చేయడం లేదు. త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇలాంటి నేఫథ్యంలో జనసేనలో మిగిలేది ఎంతమంది ? అసలు ఆ ఎన్నికల్లో పవన్ పార్టీ పోటీ చేస్తుందా ? ఈ లెక్కన చూస్తే వచ్చే ఎన్నికల నాటికి పవన్ పార్టీ ఉంటుందా? లేదా బీజేపీలో విలీనం చేస్తారా ? మూసేస్తారా ? అన్నవే ఇప్పుడు జనసేనపై వస్తోన్న హాట్ చర్చలు.