సినిమాల్లోనే కాదు..రాజకీయాల్లో కూడా తిరుగులేదని నిరూపించుకున్న దివంగత ఎన్టీఆర్ సైతం..ఒక నియోజకవర్గంలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ వేవ్ లో ఎన్టీఆర్ ఊహించని విధంగా ఓడిపోయారు. 1989 ఎన్నికలు టీడీపీకి పీడకల లాంటివి అని చెప్పొచ్చు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయి అధికారం కోల్పోయి..ప్రతిపక్షానికి పరిమితమైంది. అలాగే ఓటమి ఎరగని ఎన్టీఆర్…తొలిసారి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తిలో పోటీ చేసి..కాంగ్రెస్ అభ్యర్ధి చిత్తరంజన్ దాస్ పై ఓడిపోయారు. కాకపోతే ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ హిందుపురంలో కూడా పోటీ చేశారు. అక్కడ ఎన్టీఆర్ కు గెలుపు దక్కింది. కానీ కల్వకుర్తిలో ఓటమి పాలయ్యారు.
ఇలా ఎన్టీఆర్ ని ఓడించిన కల్వకుర్తి ప్రజలు..ఆ తర్వాత టీడీపీని రెండు సార్లు, కాంగ్రెస్ ని రెండు సార్లు గెలిపించారు. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ విజయం సాధించింది…టీఆర్ఎస్ తరుపున జైపాల్ యాదవ్ విజయం సాధించారు. కాకపోతే బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ తరుపున నిలబడిన తాల్లోజు ఆచారి కేవలం 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఈ సారి కల్వకుర్తిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
అదే సమయంలో ఇక్కడ బీజేపీ బలం పెరుగుతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ తరుపున వంశీచందర్ రెడ్డి పనిచేస్తున్నారు…కానీ ఇక్కడ కాంగ్రెస్ బాగా వీక్ అయింది. ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో కూడా కల్వకుర్తిలో బీజేపీ గెలుపు ఖాయమని తేలింది.
మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ తొలి విజయం అందుకునేది ఈ నియోజకవర్గమే అని సర్వేలు చెబుతున్నాయి. ఈ సారి కల్వకుర్తిలో టీఆర్ఎస్ గెలుపు అసాధ్యమని చెప్పొచ్చు. రోజురోజుకూ బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ కు సైతం అవకాశాలు తగ్గిపోయాయి. మొత్తానికైతే ఎన్టీఆర్ ఓడిన చోట కమలం హవా కొనసాగనుంది.