కంచుకోట‌ల్లో టీడీపీకి ఎస‌రు పెడుతోందెవ‌రు..!

-

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ దాదాపు 7 జిల్లాల్లో గ‌ట్టి ఓటు బ్యాంకు ఉంది. అదేస‌మ‌యంలో 50కిపైగా నియోజ‌క‌వ‌ర్గాలు పార్టీకి ప‌ట్టు కొమ్మ‌లు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించినా.. వారి వ్య‌వ‌హార శైలితో తిరిగి ప్ర‌జ‌లు.. టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్ప‌టికీ.. అనేక స‌మ‌స్య‌ల విష‌యంలో అధికార పార్టీ నేత‌లు అందుబాటులో లేక పోవ‌డం.. లేదా త‌మ‌లో తాము కుమ్ములాడుకుంటుండ‌డంతో ప్ర‌జ‌లు.. సామాజిక వ‌ర్గాల నేత‌లు.. కూడా టీడీపీ నేత‌ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. ఇటీవ‌ల‌.. వైశ్య సామాజిక వ‌ర్గం విజ‌య‌వాడ‌లో భేటీ అయితే.. మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ వీరి భేటీని భ‌గ్నం చేశారు.

దీంతో వైశ్య సామాజిక వ‌ర్గం టీడీపీ ఎమ్మెల్యే జ‌గ్గ‌య్య పేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాత‌య్య‌ను ఆశ్ర‌యించి.. టీడీపీ కార్యాల యంలో త‌మ స‌మావేశం పెట్టుకున్నారు. ఇలా అనేక మంది.. త‌మ‌పై జ‌రుగుతున్న దాడుల విష‌యం కావొచ్చు.. ప్ర‌భుత్వ ఫలాలు అంద‌క నిరాశ చెంద‌డం కావొచ్చు.. ప్ర‌తిప‌క్షం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది టీడీపీకి క‌లిసి వ‌స్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే.. దీనిని విచ్ఛిన్నం చేసేందుకు వైసీపీ నేత‌లు.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ నేత‌ల మ‌ధ్య విభేదాలు, వివాదాలు సృష్టించేందుకు వారు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

సోష‌ల్ మీడియా స‌హా స్థానిక మీడియాను వినియోగించి..టీడీపీ నేత‌ల్లో ఒక‌రిపై ఒక‌రికి.. వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌ల‌ను హైలెట్ చేస్తున్నారు. దీంతో టీడీపీ నాయ‌కులు వైసీపీ వ్యూహాన్ని అర్థం చేసుకోలేక‌.. ఒక‌రిపై ఒక‌రు రెచ్చిపోతున్నారు. ఈ ప‌రిస్థితి అనంత‌పురం నుంచి విజ‌యన‌గ‌రం వ‌ర‌కు చాలా జిల్లాల్లో న‌డుస్తోంది. త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్క‌లేద‌ని కొంద‌రు వ్యాఖ్య‌లు చేయ‌డం స‌హ‌జ‌మే. అయితే.. వైసీపీ నేత‌లు కొందరు.. ఈ అసంతృప్తిని మ‌రింత రెచ్చగొట్టి.. టీడీపీలో చిచ్చు పెడుతున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు శింగ‌న‌మ‌ల‌, అనంత‌పురం అర్బ‌న్‌, శ్రీకాళ‌హ‌స్తి, న‌గ‌రి, విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి.. విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్తానం, పెడ‌న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం.. ఇలా 40 వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నాయ‌కులు వారిలో వారు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. దీంతో అవ‌కాశం ఉండి కూడా త‌మ్ముళ్లు ఎలాంటి కార్య‌క్ర‌మాలూ నిర్వ‌హించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. నిజానికి వీరంద‌రినీ కూర్చోబెట్టి మాట్లాడేలా చేస్తే.. స‌మ‌స్యలు ప‌రిష్కారం అయి.. పార్టీ పుంజుకుంటుంద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. మ‌రి చంద్ర‌బాబు వింటారా?  ఆదిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటారా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news