ఏపీ సర్కార్ కు మరో షాక్ తగులుతుందా…?

-

టీటీడీ ఆస్తుల పై హైకోర్టు ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఆస్తులను కాపాడాలని కోర్టులో న్యాయవాది యలమంజుల బాలాజీ పిటీషన్ దాఖలు చేసారు. టీటీడీకి చెందిన ఆస్తుల వివరాలను కోర్టు ముందు ఉంచాలని ధర్మాసనం ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చింది. పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టిన ఆస్తుల వివరాలను కూడా తమ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆస్తుల పరిరక్షణకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో నియమించిన కమిటీ వివరాలను కూడా తమకివ్వాలని ఆదేశించింది. ఆస్తుల జాబితాను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలని న్యాయవాది బాలాజీ విజ్ఞప్తి చేస్తూ స్ధిర, చరాస్తులు అమ్మేందుకు టీటీడీకి అధికారం లేదని వాదించారు. ఆస్తులను ఇప్పటికే పబ్లిక్‌ డొమైన్‌ లో పెట్టామని ధర్మాసనానికి టీటీడీ న్యాయవాది వివరించారు.

ఆస్తుల పరిరక్షణకోసం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ నియమించామని టీటీడీ కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళింది. అయిదు రోజుల తరువాత విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. ఇక ఇదిలా ఉంటే టీటీడీ ఆస్తులను అమ్మాలి అని నిర్ణయం తీసుకోవడంపై అందరూ విమర్శలు చేసారు. ఆస్తులు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ నిలదీశారు. రాజకీయ కారణాలతో ఆస్తులను అమ్మేస్తున్నారు అనే ఆరోపణలు చేసారు. ఇప్పుడు కోర్ట్ పరిధిలో ఉన్న నేపధ్యంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news