ముత్తిరెడ్డికి మూడో సారి కష్టమేనా?

-

గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచి…అధికారాన్ని అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులకు ఈ సారి గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఈ మధ్య వస్తున్న సర్వేల్లో తెలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పీకే టీం చేసిన అంతర్గత సర్వేల్లో టీఆర్ఎస్ లో వరుసగా రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉందని తేలిందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే…అలాంటి వారికి మళ్ళీ సీటు ఇస్తే గెలిచే అవకాశాలు కూడా తక్కువని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం కష్టమని సమాచారం.

అయితే జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సైతం ఈ సారి గెలుపు కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాస్త దూకుడుగా ఉండే ముత్తిరెడ్డి..కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 1994లోనే మేడ్చల్ సీటు కోసం ట్రై చేశారు…కానీ అప్పుడు టికెట్ రాలేదు…ఆ తర్వాత కొన్నాళ్లు కాంగ్రెస్ లో పనిచేసి…సరైన అవకాశాలు రాలేదని చెప్పి టీఆర్ఎస్ లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున ఉప్పల్ లో పోటీ చేసి ఓడిపోయారు.

ఇక 2014లో కాంగ్రెస్ కంచుకోట అయిన జనగాంలో పోటీ చేసి…కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యపై విజయం సాధించారు. అలా తొలిసారి ముత్తిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అదే ఊపుతో 2018 ఎన్నికల్లో కూడా ముత్తిరెడ్డి మరొకసారి పొన్నాలపై గెలిచారు. ఇలా రెండుసార్లు గెలవడమే కాకుండా…రెండుసార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా పనిచేస్తూ వస్తున్నారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేగా జనగాంలో ముత్తిరెడ్డి చేసిన అభివృద్ధి పెద్దగా లేదని విమర్శలు వస్తున్నాయి. ఏదో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు తప్ప…స్పెషల్ గా జనగాం ప్రజలకు ఒరిగింది ఏమి లేదని తెలుస్తోంది.

ఇదే క్రమంలో జనగాంలో ముత్తిరెడ్డి అక్రమాలు ఎక్కువే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో భూ అక్రమాల విషయంలో జిల్లా కలెక్టర్, ముత్తిరెడ్డిల మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది. తాజాగా కేసీఆర్ కు ఓటు వేసిన వారికే దళితబంధు అని మాట్లాడి…దళిత ఓటర్లని దూరం చేసుకుంటున్నారు.

ఏదేమైనా గాని రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ముత్తిరెడ్డికి జనగాంలో పెద్ద పాజిటివ్ లేదని ఇటీవల వచ్చిన సర్వేలు చెబుతున్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని తెలుస్తోంది. మొత్తానికైతే ముత్తిరెడ్డికి మూడోసారి గెలిచే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news