జోగి రమేష్ …ఏపీలో అధికార వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేల్లో ఒకరు. పెడన నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన జోగి…దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా మంత్రి పదవిని దక్కించుకోవాలని జోగి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే జోగి ఈ మధ్య రాజకీయాల్లో బాగా హైలైట్ అవుతున్నారు. అసలు జగన్ మీద ఈగ వాలనివ్వకుండా చూసుకుంటున్నారు.
మామూలుగానే జోగి రమేష్ ఫైర్ బ్రాండ్ నాయకుడు…పైగా మంత్రి పదవి ఆశిస్తుండటంతో తనలోని ఫైర్ ఇంకా బయటపెడుతున్నట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశం నుంచి జోగి రూట్ మారింది. అసెంబ్లీలోనే ఎప్పుడు ఏ నాయకుడు మాట్లాడని విధంగా జోగి రమేష్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుని పరుష పదజాలంతో దూషించారు. అలాగే చంద్రబాబుపై గట్టిగా ఫైర్ అయ్యారు.
అయితే జోగి రమేష్ ఎప్పుడూలేని విధంగా అసెంబ్లీలో అలా మాట్లాడటానికి కారణం..మంత్రి పదవి అని అంటున్నారు. పదవి కోసమే రమేష్ తనలోని ఫైర్ అంతా బయటపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఎక్కువగా మీడియా సమావేశాలు పెట్టడం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడం జరుగుతుంది. అలాగే సీఎం జగన్‌కు ఓ రేంజ్‌లో భజన చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే, బీసీలకు జగన్ సరికొత్త రాజ్యాంగం రాస్తున్నారని మాట్లాడారు. అసలు అంబేద్కర్ భారతదేశ ప్రజలందరీ కోసం రాజ్యాంగం రాశారనే విషయం కూడా తెలియకుండా జోగి, జగన్‌కు భజన చేశారు.
అయితే త్వరలోనే జగన్…మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు. ఇక అప్పుడు మంత్రిగా ఛాన్స్ కొట్టేయాలని జోగి చూస్తున్నారు. బీసీ కోటాలో తనకు ఛాన్స్ ఇస్తారని ఆతృతగా ఉన్నారు. అందుకే ఈలోపు చంద్రబాబుని విమర్శించడం, జగన్‌కు భజన చేసే కార్యక్రమాలు చేస్తున్నారని అంటున్నారు. ఇక ఈ భజన వినడం తమ వల్ల కాదని, జోగికి మంత్రి పదవి ఇచ్చేయాల్సిందే అని సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయి.