ఆఫ్గనిస్థాన్ లో ప్రస్తుతం పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. జనాలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎప్పుడు ఏ తాలిబన్ మూక వచ్చి అల్లరి చేస్తుందో తెలియని అయోమయ స్థితిలో గడుపుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఆ దేశం విడిచి పెట్టాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్ ఉన్న సంకట స్థితికి అమెరికాయే కారణమని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ దేశానికి చెందిన కాంగ్రెస్‌మన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అమెరికా కాంగ్రెస్ మన్ స్టీవ్ చాబట్ ఆఫ్గనిస్థాన్ లోని పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. ఆఫ్గనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకునేందుకు పాకిస్థాన్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కీలకంగా వ్యవహరించిందని ఆరోపించారు. తాలిబన్లు ఆఫ్గనిస్థాన్ ను ఆక్రమించాక పాక్‌కు చెందిన వారు వేడుకలు జరుపుకోవడం సిగ్గు చేటన్నారు.
ఆఫ్గనిస్థాన్ లో రాక్షస కాండ నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఏ విషయమైనా సరే తాము పెద్దగా పట్టించుకోమని, ఆ దేశంలోని కొందరు వ్యవహరించే తీరు పట్ల, చేసే వేధింపుల పట్ల తమ పౌరులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఆఫ్గనిస్థాన్ లో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. యువతులను వారి కుటుంబాల నుంచి దూరంగా తీసుకెళ్తున్నారని, బలవంతపు పెళ్లిళ్లు చేయిస్తున్నారని అన్నారు. అయితే ఆఫ్గనిస్థాన్ లో ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయి, అమెరికా ఎలా జోక్యం చేసుకుంటుంది అన్న విషయాలపై ఆయన మాట్లాడలేదు.