దేశాన్ని ప్రేమించే వారికి, పట్టి పట్టి మట్టిని ప్రేమించేవారికి ఇదొక సహేతుక సందర్భం. నేల విడిచి చేయని సాము ఇది. కష్టం ఫలితం ఇస్తే రైతు రాజు అవుతాడు. ఆ రాజే రైతును మరో రాజు చేస్తాడు కూడా ! నేల నుంచి నేత ల వరకూ కలల సాగుకు ఫలం వచ్చింది. వాస్తవిక రూపంలో దేశమే గర్వించదగ్గ పరిణామాలు ఆర్బీకే తో చోటు చేసుకున్నాయి. అందుకే జగన్ సర్కారుకు ఎవ్వరూ ఊహించని రూపంలో ఓ గొప్ప పురస్కారం వచ్చేందుకు ఆస్కారం ఉంది. రైతు భరోసా కేంద్రాల పేరిట వరించి వచ్చే ఆ విజయం త్వరలోనే జగన్ కు ఓ గొప్ప నూతనోత్సాహం అందించడమే కాదు మరొక పాలన సంబంధ సంస్కరణకు అదొక ఊతం కూడా !
సాగుకు సంబంధించి కొన్ని సమస్యలు మోసుకుంటూ వెళ్తున్న రంగాన్ని ఆదుకుంటూ, సంస్కరణాయుత పథగామిగా నిలిచి ఉన్నారు వైఎస్ జగన్. యువ ముఖ్యమంత్రి చేసిన ఓ విభిన్న ప్రతిపాదన తరువాత రూపం దాల్చడం, కాల గతిలో మంచి పేరు రావడం ఇప్పుడు కేంద్రం కూడా నేరుగా తన మెచ్చుకోలు చెప్పడమే కాకుండా ఐక్య రాజ్య సమితికి సంబంధిత వివరాలు పంపి, ప్రపంచ స్థాయిలో అందుకునే గౌరవ పురస్కారానికి నామినేట్ చేయడం ఇవన్నీ ఇవాళ వైసీపీ ఆనందాలకు అవధులు అన్నవి లేకుండా చేస్తున్నాయి.
సాగు బాగుంటే రైతు బాగుంటే దేశం బాగుంటుంది. పచ్చని చేలలో వినిపించే నవ్వులే అందరి ఆయువుకూ ఆధారాలు. అందుకు తగ్గ సాయం నేను చేస్తాను. వ్యవసాయం కు అనుగుణంగా ఏం కావాలో చెప్పండి.. సాగు యోగ్యత పెంచుకునేందుకు ఆధునికత అందుకోండి అంటూ జగన్ ఇచ్చిన పిలుపే రైతు భరోసా కేంద్రం .. క్లుప్తంగా ఆర్బీకే ..
జగన్ సర్కారుకు మంచి రోజులు వచ్చాయి. ఇంతవరకూ ఎన్నో విమర్శలు భరించిన జగన్ సర్కారు మంచి రోజులు రావడమే కాదు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇన్ని రోజులూ నానా మాటలూ భరించిన జగన్ సర్కారుకు ఇకపై అటువంటి గందరగోళం లేదు. అటువంటి అవస్థ కూడా ఉండదు అని తేలిపోయింది.ఆ విధంగా వైసీపీ సర్కారు మరియు సంబంధిత శ్రేణులు ఈ శుభవార్త విని సంబరాలు చేసుకుంటున్నాయి.
మొదట నుంచి నాన్న బాటలో వెళ్తున్న జగన్ కు ఇదొక మంచి ఉత్సాహాన్ని ఇచ్చిన వార్త. మొదట్నుంచీ సేద్య గాడ్ని నిర్లక్ష్యం చేయకుండా పని చేస్తున్న జగన్ కు ఇదొక ఉత్సాహం మాత్రమే కాదు గర్వించ దగ్గ పరిణామం కూడా ! వ్యవసాయ రంగాన్ని మరియు అనుబంధ రంగాలనూ ఆదుకోవాలని భావిస్తున్న జగన్ కు ఈ సారి ప్రపంచ స్థాయి గుర్తింపు రానుంది. ఆయన బ్రైన్ చైల్డ్ గా చెప్పుకునే రైతు భరోసా కేంద్రాలకు అనూహ్య రీతిలో యునెస్కో నుంచి గుర్తింపు దక్కనుంది.
ఈ మేరకు కేంద్రం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఐక్యరాజ్య సమితికి పంపింది. ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థగా పేర్కొనే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ఈ విషయమై సానుకూలంగానే ఉంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత మంచి వ్యవస్థ లేనేలేదని ఎఫ్ఏఓ ప్రతినిధి (కంట్రీ హెడ్ ) టోమియో షిచిరీ ఆనందం వ్యక్తం చేశారు. ఆర్బీకే లాంటి వ్యవస్థ ప్రపంచంలో లేనేలేదని చెబుతూనే, ఇక్కడి వసతులు, సౌకర్యాలు చూసి అబ్బురపడ్డారాయన. దీన్నొక వినూత్న రీతికి చెందిన ఆలోచన గానే గుర్తించి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాధిపతికి ఆ గౌరవాన్నీ మరియు ఆ గౌరవ పురస్కారాన్నీ అందించనున్నారు.