ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు ఆశ్చర్యంగా మారుతున్నాయి. పంచాయితీ ఎన్నికలకు ముందు గంటకో రకంగా జరుగుతుంది రాజకీయం. వైసీపీ రాష్ట్రంలో చాలా బలంగా ఉంది. అలాగే విపక్ష పార్టీ కూడా క్షేత్ర స్థాయిలో బలంగానే ఉంది. ఎలా అయినా సరే విజయం సాధించి జగన్ జోరుకు బ్రేక్ వెయ్యాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు పలు వ్యూహాలను కూడా వివరించారు.
మరి జనసేన బిజెపి పరిస్థితి ఏంటీ…? ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు పార్టీలు కలయిక కాస్త ఆశ్చర్యమే. పొత్తు పెట్టుకుని ముందుకి వెళ్తున్నాయి ఈ రెండు పార్టీలు. స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చెయ్యాలని భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఇతర పార్టీల నేతలకు గాలం వేయడం ఆశ్చర్యంగా మారింది. ఇందులో భాగంగా అధికార పార్టీ నేతలకు జనసేన నేతలు పదవులు ఆఫర్ చేస్తూ తీసుకోవాలని చూస్తున్నారు.
విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గానికి చెందిన గోవిందరెడ్డి నాయకత్వంలో కొంతమంది వైసీపీ యువకులు జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. విశాఖకు అనుకూలంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటుంటే ఇలా ఎందుకు జరిగి ఉంటుంది అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. వాస్తవానికి జనసేన పార్టీకి నాయకత్వ సమస్య ఉంది. అలాంటి పార్టీని ఏ విధంగా వైసీపీ కార్యకర్తలు నమ్ముతున్నారు అనేది చెప్పలేని పరిస్థితి.
ఏపీలో బీజేపీకి ఉన్న కాస్తో కూస్తో కేడర్‌ని తనవైపు తిప్పుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. అలా 2024లో వైసీపీకి తమ పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పవన్. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయి నేతల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కర్నూలు జిల్లాలో కూడా జనసేన వైసీపీ క్యాడర్ కి గాలం వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జనసేన పార్టీలోకి వస్తే కొందరు నేతలకు జిల్లా పదవులు ఇస్తామని తర్వాత రాష్ట్ర స్థాయిలోకి తీసుకుంటాం అని చెప్పడం విశేషం.