అధికారం లేని రోజుకు..అధికారంలో ఉన్న రోజుకు ఎంతో తేడా? ఏదో తెలియని వెలితి కూడా ! తెలుగుదేశం పార్టీ ఇవాళ నాలుగు పదులు పూర్తి చేసుకుంటుంది.విశిష్టం అయిన రోజు అని చరిత్రలో చెప్పుకోదగ్గ రోజు అని ఈ మార్చి 29 గురించి ప్రత్యేకించి చెబుతోంది. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అనే పేరు వినగానే అందరికీ కలిగే ఆనందమే ఆ రోజు ఉన్న కార్యకర్తల్లోనూ కలిగింది. నాయకుల్లోనూ కలిగింది.
అప్పటికి పార్టీపెట్టాలన్న ఆలోచన దగ్గర నుంచి ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల ఉత్సాహం ఎదిగివస్తోంది.
క్రమక్రమంగా ఎదిగివస్తోంది. దర్శకుడు ఎన్టీఆర్, నటుడు ఎన్టీఆర్, నిర్మాత ఎన్టీఆర్.. ఎన్ని తలలు ఆయనకు ఎన్ని పేర్లు ఆయనకు. అలాంటిది రాజకీయమా ఎందుకని.. కాషాయం కట్టి రాజకీయం.. ఖాకీ చొక్కాలు తొడిగి రాజకీయం..బూడిద ను పూసుకుని రాజకీయం.. ఏదో ఒక విధంగా ప్రజలను ఆకర్షించాలన్న తపనతోనే రాజకీయం.
కేవలం జనాకర్షణే ధ్యేయంగా రాజకీయం చేయడంలో ఉన్నతి లేదు. వారి కోసం ఏమయినా చేయాలి. సాహసోపేత నిర్ణయాలు కొన్ని ఎన్టీఆర్ అనే వ్యక్తి స్థాయిని పెంచాయి. కరణీకం రద్దు చేశారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. పేదలకు జనతా వస్త్రాలు ఇచ్చారు. రూపాయికే కిలో బియ్యం అన్నారు. మద్య నిషేదం చేసి మరో సాహసోపేత నిర్ణయం తో కొంత వివాదం అయ్యారు. కొంత అభాసుపాలయ్యారు.ఇలా ఎన్నో ! పటిష్ట నిర్ణయాలు కారణంగా పేరు తెచ్చుకున్నారు. ఆలోచనల్లో తడబాటు కారణంగా తప్పులు చేశారు. ఏదేమయినప్పటికీ తెలుగు జాతిని ఏకం చేసిన లీడర్ గా ఎన్టీఆర్ కు ఉన్న పేరు ఎవ్వరికీ రాదు.ఆయన స్థాపించిన పార్టీకి ఆత్మగౌరవమే నినాదం.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు.
ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ పార్టీ ఎన్నో అవరోధాలు దాటింది. ఉమ్మడి రాష్ట్రాన తొమ్మిదేళ్లు తరువాత అవశేషాంధ్రలో ఐదేళ్లు పాలన అందించారు మాజీ సీఎం చంద్రబాబు. పరిణామాలు ఏమయినా సరే ! తెలుగుదేశం ఇప్పుడున్న స్థితిలో రాణించడం కాస్త కష్టం. లీడర్ ఉన్నా క్యాడర్ లేదు క్యాడర్ ఉన్న చోట లీడర్ లేరు. చంద్రబాబు తరువాత ప్రత్యామ్నాయ నాయకత్వం లేదు. లోకేశ్ నాయకత్వాన్ని అంగీకరించేందుకు అచ్చెన్నాయుడు లాంటి సీనియర్లు సిద్ధంగా లేరు. తారక్ ఇటుగా వచ్చినా కూడా పార్టీలో ఆయనకు ప్రాధాన్యం పూర్తి స్థాయిలో దక్కదు..దక్కనీయరు కూడా! కనుక వచ్చే ఎన్నికలు
బాబుకు మరియు కొందరికి సవాళ్లను ఇస్తాయి. అవసరం అనుకుంటే పార్టీకి కొన్ని ప్రశ్నలు మిగిల్చి వెళ్తాయి కూడా ! కనుక బాబు తో పాటు ఇంకొందరు తాము రాణించాల్సినంత రాణించడం అన్నది ఇప్పటి బాధ్యత మరియు కర్తవ్యం. నలభై ఏళ్ల పార్టీకి శుభాకాంక్షలు.. మరియు అభినందనలు.
మూడు తరాలకు తెలుగు వెలుగు ప్రసారం… 40 ఏళ్ళ తెలుగుదేశం ప్రస్థానం#40GloriousYearsOfTeluguDesam#TDPFoundationDay pic.twitter.com/zRHhfB777h
— Telugu Desam Party (@JaiTDP) March 29, 2022
– పొలిటికల్ ఎఫైర్స్ – మన లోకం ప్రత్యేకం