యూపీ తలరాతను మార్చిన సన్యాసి.. యోగి ఆదిత్యనాథ్‌

-

ఆర్‌ఎస్‌ఎస్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. . .అయినప్పటికీ హిందూత్వంపై పాఠాలు చెప్పగల దిట్ట ఆయన. జనసంఘ్‌,భాజపాల నుంచి ఓనమాలు నేర్చుకోకపోయినా కమలం పార్టీకే దేశభక్తి నూరిపోయగల ఘనాపాటి. గోరఖ్‌నాథ్‌ మఠం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన ఇంతింతై వటుడింతై అన్నట్లు మఠాధిపతి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగారు.బీజేపికి ప్రధాని నరేంద్ర మోడీ కొండంత అండ అయితే…యూపీలో భారతీయ జనతా పార్టీకి ఆయనే అదనపు అండ.నిన్ననే 51వ పుట్టిన రోజు జరుపుకున్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ప్రత్యేక కథనం

1972 జూన్‌ 5న ఉత్తరాఖండ్‌ రాష్ర్టంలో ఉన్న పాంచూర్‌ జిల్లా పౌరిఘర్వాల్‌లో జన్మించారు యోగి ఆదిత్యనాథ్‌. ఆనంద్‌సింగ్‌ బిస్త్‌,సావిత్రీదేవి అతని తల్లిదండ్రులు. రాజ్‌పుత్‌ వంశానికి చెందిన ఆయన అసలు పేరు అజయ్‌సింగ్‌ బిస్త్‌. రిషికేష్‌లో ప్రాధమిక విద్యాభ్యాసం చేసిన యోగీ గణితశాస్ర్తంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. 1990లో అయోధ్య రామమందిరం ఉద్యమంలో చేరారు. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ మఠం ప్రధాన పూజారి అవైద్యనాథ్‌ శిష్యుడిగా మారారు. ఆయనే అజయ్‌ సింగ్‌ పేరును యోగి ఆదిత్యనాథ్‌గా మార్చారు. 1994లో గోరఖ్‌నాథ్‌ మఠం పూజారి అయ్యారు యోగి.రాజకీయాల నుంచి అవైద్యనాథ్‌ విశ్రాంతి తీసుకున్నాక ఆయన స్థానంలో యోగీ అరంగేట్రం చేశారు.

అలా 1998లో 26 ఏళ్ళ వయసులోనే ఎంపీగా గెలిచారు. తరువాత 1998,1999,2004,2009,2014 వరుసగా ఐదు సార్లు బీజేపీ తరపున గోరఖ్‌పూర్‌ నుంచి పార్లమెంట్‌ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2002లో యువ వాహిని సంస్థను స్థాపించి గో సంరక్షణకు శ్రీకారం చుట్టారు. అలాగే లవ్‌ జీహాదీకి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారు. 2014లో అవైద్యనాథ్‌ మరణించాక గోరఖ్‌పూర్‌ మఠం ప్రధాన పూజారిగా బాధ్యతలు స్వీకరించారు యోగీ.

యూపీలో జనాకర్షక నేతగా గుర్తింపు పొందిన యోగీ మాటలను తూటాల్లా పేల్చడంలో దిట్ట. యోగీ ఉపన్యాసాలకు యూపీలోని అన్ని వర్గాల్లో యమ క్రేజ్‌ ఏర్పడింది.ఈ లక్షణాలే కమలం పార్టీలో ఆయన్ను కీలక ప్రచారకర్తగా చేశాయి.2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన యోగీ ఎవరూ ఊహించని విధంగా సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. గోరఖ్‌పూర్‌ ఎంపీగా ఉన్న ఆయన రాజీనామా చేసి శాసనమండలికి ఎంపికయ్యారు. ఆ తరువాత ఎన్నికల్లో గోరఖ్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కిందటేడాది రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు.మోడీ మాదిరిగానే యోగీ కూడా అభివృద్ధి మంత్రం జపిస్తుంటారు. అవినీతి,రౌడీయిజం,అంధకారం లేని ఉత్తరప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తూన్నారు. శాంతి భద్రతలపై యోగి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అక్కడి మహిళలకు భద్రత విషయంలో స్పెషల్‌ కేర్‌ తీసుకున్నారాయన.కొవిడ్‌ సమయంలో మహమ్మారి కట్టడికి యోగి ఆదిత్యనాథ్‌ తీసుకున్న చర్యలను ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడింది. తన అభివృద్ధి మంత్రం,ప్రశాంత యూపీ నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలు తరువాతి పీఎం అభ్యర్ధిగా రేసులోకి తీసుకొచ్చాయి.

ఉత్తరప్రదేశ్‌లో ప్రజల ఆదరాభిమానులు సొంతం చేసుకుని దేశవ్యాప్తంగా విశేష ఆదరణ సంపాదించిన యోగి సోమవారం తన 51వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు బీజేపీ నాయకులు,ఇతర రాజకీయ పార్టీల నాయకులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు చేపట్టి యూపీకే కాకుండా దేశానికి తన విలువైన సేవలు అందించాలని మనలోకం టీమ్‌ ఆశిస్తోంది. విష్‌ యు హ్యాపీ బర్త్‌డే బుల్డోజర్‌ బాబా సార్‌ ……

Read more RELATED
Recommended to you

Exit mobile version