అంతా ఊహించినట్లుగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మరోసారి అందరిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వైసీపీ ఫ్లాగ్ షిప్ పథకం అమ్మఒడి మరోసారి వైసీపీకి ఓట్లు కురిపించేలా ఉంది. 2019లో తొలిసారిగా కేవలం నాలుగు పేజీలతోనే మేనిఫెస్టో విడుదల చేశారు జగన్. ఇప్పుడు మరోసారి అదే విధానాన్ని అమలు చేశారు. అయితే ఈసారి కేవలం రెండు పేజీలు మాత్రమే. 2019లో నవరత్నాల పేరుతో ఓటర్లకు హామీలిచ్చిన జగన్… ఈసారి మాత్రం నవరత్నాల ప్లస్ పేరుతో అవే హామీలను కొనసాగిస్తామని మరోసారి భరోసా ఇచ్చారు జగన్.
వాస్తవానికి తండ్రి రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన జగన్.. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదవి చేపట్టారు. ఆ సమయంలో ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, రూ.2కే కిలో బియ్యం పథకాలను వైఎస్‌ఆర్ అమలు చేశారు. ఆ తర్వాత 2009లో టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కూటమిగా ఏర్పడినప్పటికీ… వైఎస్‌ఆర్ మాత్రం కాంగ్రెస్ పార్టీని సింగిల్‌గా ముందుకు నడిపారు.
ఆ సమయంలో ఆయన చెప్పిన మాట ఒక్కటే. మేము ఇస్తున్న పథకాలను కొనసాగిస్తామని… వైఎస్‌ఆర్ ఇచ్చిన ఆ ఒక్క హమీతోనే కాంగ్రెస్ పార్టీ రెండోసారి కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జగన్ కూడా సరిగ్గా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఐదేళ్లుగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని కొనసాగిస్తామన్నారు. పైగా ఇప్పుడు ఇస్తున్న వాటికి కొంత అదనంగా కూడా ఇస్తామని జగన్ హామీ ఇస్తున్నారు. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచే వైఎస్ అనే బ్రాండ్ నేమ్ ఇచ్చే హామీ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. పైగా ప్రతిపక్షాల మాదిరిగా అమలు చేస్తామని చెప్పడమే కాకుండా… ఎప్పుడు అమలు చేసేది కూడా తేదీతో సహా జగన్ చెప్పడాన్ని ఏపీ ప్రజలు మరింత బలంగా విశ్వసిస్తున్నారు.