పాకిస్తాన్ క్రికెటర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వరుస ఓటములకు తోడు ఆ దేశ బోర్డు నుంచి వారికి సాయం కూడా అందడం లేదని తెలుస్తోంది. గత నాలుగు నెలలుగా క్రికెటర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో పీసీబీ బోర్డు ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. జీతాలు అందుకోని ఆటగాళ్లలో బాబర్ అజామ్, రిజ్వాన్, షహీన్ షా అఫ్రిది తదితరులు ఉన్నట్లు సమాచారం. పురుషులతో పాటు మహిళా క్రికెటర్లకూ వేతనాలు ఇవ్వలేదని తెలుస్తోంది. 2023 జులై 1 నుంచి 2026 జూన్ 30 వరకు సుమారు 25 మందికి పీసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ఇచ్చిన విషయం తెలిసిందే.
‘గతేడాది వన్డే ప్రపంచకప్ ముందు కొందరు సీనియర్లు బోర్డుపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు అనుకూలంగా కాంట్రాక్ట్‌లను దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పుడు కనీసం నెలవారీ వేతనాలు కూడా అందుకోలేకపోతున్నారు.జులై నుంచి అక్టోబర్ వరకు జీతాలు లేవు.ఇప్పటికే బోర్డు దృష్టికి సమస్యను తీసుకెళ్లినా వెయిటింగ్ మాత్రం తప్పలేదు. తమ జెర్సీలపై లోగో వేసుకున్నందుకు చెల్లించాల్సిన స్పాన్సర్‌షిప్ పేమెంట్ కూడా బకాయిగానే ఉంది. దీంతో కాంట్రాక్ట్‌లను పునఃసమీక్షించే అవకాశం లేకపోలేదు’ అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.