రెండు రోజులు కాస్త విశ్రాంతి తీసుకున్న వరణుడు మళ్లీ తన ప్రతాపం చూపించడానికి రెడీ అవుతున్నాడు. తెలంగాణలో రాగల మూడ్రోజులు మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వాన పడుతుందని తెలిపారు. శనివారం రోజున మాత్రం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
ఈరోజు ఉత్తర-దక్షిణ ద్రోణి.. ఉత్తర-దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ. ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. నుంచి 3.1 కి.మీ. ఎత్తు మధ్య విస్తరించి ఉందని వాతావరణ సంచాలకులు నాగరత్న పేర్కొన్నారు. బుధవారం రోజున ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం.. ఈరోజు బలహీన పడిందని వివరించారు.
మళ్లీ వర్షాలు కురుస్తాయనే వార్త వినగానే రాష్ట్ర ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికీ గత వానలు, వరదల ప్రభావం నుంచి తేరుకోలేదని ఆవేదన చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే వరదల ధాటికి మునిగిన ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నామని.. ఇంతలోనే మళ్లీ వాన అంటే గుండెల్లో గుబులు పుడుతోందని వాపోతున్నారు. మరోవైపు రైతులు తాము వేసిన పంటలు నీట మునిగాయని.. పెట్టుబడి అంతా వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.