కరోనా కష్టకాలంలో కనుమరుగైన నేతల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్న పవన్ కల్యాణ్.. మళ్లీ ఈమధ్య “స్పందించడం”, “ప్రశ్నించడం” స్టార్ట్ చేశారు! ప్రస్తుతం తన అధిష్టాణం “హస్తినలోని బీజేపీ పెద్దలు”.. అన్న క్రమశిక్షణతో మసులుకుంటున్న పవన్… తాజాగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక్కడే పవన్ కి “క్రమశిక్షణ”, “కలుపుగోలుతనం”లో ఫుల్ మార్కులు పడుతున్నాయని అంటున్నారు!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కష్టాలు, ఇళ్లు కేటాయింపు, రేషన్ డీలర్ల ఆందోళన, అమరావతి ఉద్యమం వంటి అంశాలపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ నోట జాలువారిన ఒక మాట… “భారతీయ జనతా పార్టీతో కలసి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తాం” అని చెప్పడం. సరిగ్గా ఇక్కడే పవన్ పై ప్రశంసల వర్షాలు కురుస్తున్నాయంటున్నారు!
ఏపీలోని బీజేపీ నేతలే అధిష్టాణాన్ని లెక్కచేయకుండా సొంతపెత్తనాలు చేస్తున్న ఈ రోజుల్లో కూడా… పవన్ ప్రతీ విషయంలోనూ హస్తినలోని బీజేపీ పెద్దలకు చెప్పి చేయడంతోపాటుగా… జనసేన చేసే ప్రతీ రాజకీయ, సామాజిక, సేవాకార్యక్రమంలోనూ బీజేపీని కలుపుకుపోతున్నారు!! కరోనా వచ్చిన కొత్తలో.. జనసేన చేస్తోన్న సేవా కార్యక్రమాల విషయంలో కూడా పవన్.. జనసైనికులకు ఇదే విషయాన్ని చెప్పారు. వారు పెడచివిన పెట్టిన సంగతి కాసేపు పక్కనపెడితే… పవన్ మాత్రం ప్రతీ విషయంలోనూ బీజేపీని కలుపుకునే పోతున్నారు!
దీంతో… పవన్ అంత కలుపుగోలుగా బీజేపీని అన్ని విషయాలలోనూ కలుపుకుని పోతుంటే… ఏపీ బీజేపీ నేతలు మాత్రం… పవన్ ని సొంత మనిషిగా చూడటం లేదని, ఏదైనా పనిచేసేముందు కనీసం మర్యాదపూర్వకంగా అయినా సంప్రదించడంలేదని తెగ పెయిన్ ఫీలవుతున్నారంట. వారి పెయిన్ లో కూడా న్యాయముందనేది ఈ సందర్భంగా వినిపిస్తోన్న కామెంట్!!