ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకు ఎంత దీనస్థితికి చేరి పోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరంగా కేవలం 23 సీట్లతో సరిపెట్టుకుంది. టిడిపి నుంచి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. ఇదే జాబితాలో మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు సొంత పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దాదాపు 30 నియోజకవర్గాల్లో పార్టీని నిలబెట్టే సరైన నాయకులు లేక అత్యంత దారుణ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు కాడి కింద పడేశారు. పార్టీ పుంజుకుంటుందని ఆశలు కూడా లేకపోవడంతో వారంతా ఎందుకు తిరగడం అన్న డైలమాలో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కనుచూపు మేరలో కూడా పార్టీని నిలబెట్టే నాయకుడు కనపడటం లేదు అంటే అక్కడ ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో తెలుస్తోంది. ఈ లిస్ట్ లో తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజవర్గం అగ్రస్థానంలో ఉంది. రామచంద్రపురం పేరు చెబితేనే గత మూడు దశాబ్దాలుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు పేర్లు ప్రధానంగా వినిపిస్తుంటాయి.
రాజకీయంగా ఆగర్భ శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు మంత్రిగా ఉండి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిన తోట త్రిమూర్తులు వైసీపీలోకి జంప్ చేసి ఇప్పుడు అమలాపురం పార్లమెంటరీ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబోయిన వేణు మంత్రిగా ఉన్నారు. నియోజకవర్గంలో ముగ్గురు బలమైన నేతలు వైసీపీలోనే ఉండడంతో ఇప్పుడు అక్కడ టిడిపి నుంచి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించేందుకు కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి.
2009 ఎన్నికల్లో అప్పటివరకు టిడిపి లో ఉన్న తోట త్రిమూర్తులు ప్రజారాజ్యంలోకి వెళ్లిపోవడంతో చంద్రబాబు ఊరు పేరు లేని ఓ ద్వితీయ శ్రేణి నేతకు సీటు ఇస్తే టిడిపి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బోస్ – త్రిమూర్తులు – వేణు లాంటి బలమైన నేతలను ఢీకొట్టి రామచంద్రపురంలో టిడిపిని నిలబెట్టటం అనేది అసాధ్యం అనే చెప్పాలి. పార్టీని నిలబెట్టే నాయకుడు లేకపోవడంతో రామచంద్రపురంలో ద్వితీయ శ్రేణి నేతలు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీకి పోటీ చేసే అభ్యర్థి కూడా దొరకడు అన్నది వాస్తవం. మరి చంద్రబాబు ఎప్పటికి అయిన రామచంద్రపురం పై దృష్టి పెట్టి పార్టీని కాపాడతారో లేదో చూడాలి.
-vuyyuru subhash