ఏపీలో కరెంట్ కోతలపై ప్రభుత్వం గందరగోళ ప్రకటనలు చేస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కోతలు ఉంటాయని ఒకసారి, ఉండవని మరోసారి ప్రకటన చేశారన్నారు. అంటే విద్యుత్ విధానంపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. గ్రామాల్లో తొమ్మిది గంటల విద్యుత్ అని జగన్ హామీ ఇచ్చారని.. ఇప్పుడు అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. ప్రజలు రోడ్ల పైకి వచ్చి విద్యుత్ కార్యాలయాలను ముట్టడించే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఒక రోజుకు 240 మిలియన్ యూనిట్లు అవసరమైతే, కేవలం 198 మిలియన్ యూనిట్లు మాత్రమే అందుతోందని విమర్శించారు. విద్యుత్ అవసరాలు, వినియోగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలను నివారించాల్సిన ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లిపోయారని దుయ్యబట్టారు.