సింధు మరిన్ని విజయాలు సాధించాలి: సీఎం జగన్

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్, తెలుగు తేజం పీవీ సింధు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవ‌లి కామ‌న్వెల్త్ గేమ్స్ లో స‌త్తా చాటిన పీవీ సింధు, భార‌త హాకీ జ‌ట్టు స‌భ్యురాలు ర‌జ‌ని గురువారం సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కామ‌న్వెల్త్ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారుల స‌త్తాను జ‌గ‌న్ కీర్తించారు. కామ‌న్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింట‌న్‌లో పీవీ సింధు ప‌సిడి ప‌త‌కంతో మెరిసిన సంగ‌తి తెలిసిందే.

అదే స‌మ‌యంలో మునుప‌టి కంటే మెరుగ్గా రాణించిన భార‌త హాకీ జ‌ట్టులో ర‌జ‌నీ కీల‌క భూమిక పోషించింది. కామ‌న్వెల్త్ గేమ్స్ ముగిసిన త‌ర్వాత రాష్ట్రానికి చేరుకున్న సింధు, ర‌జ‌నిలు ఇటీవలే ఏపీ క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ఇంటికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. రోజా కుటుంబంతో క‌లిసి వారిద్ద‌రూ మ‌ధ్యాహ్న భోజ‌నం కూడా చేశారు. తాజాగా గురువారం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చిన క్రీడాకారులు సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు.