తమ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీనియర్ శాసనసభ్యుడు ఆనం రామ నారాయణరెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, తాను రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని రఘురామకృష్ణ రాజు గారు ధీమా వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారికి ఐదేళ్ల వరకు మళ్లీ ఎన్నిక కావలసిన అవసరం లేదని, గతంలో జుగుస్సాకరమైన ట్విట్లు చేసిన ఆయన, గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారినట్టు ప్రస్తుతం సంస్కారవంతమైన ట్విట్లను చేస్తున్నారని అన్నారు.
ఉన్నత విద్యావంతుడైన విజయసాయిరెడ్డి గారు నీచమైన భాషలో, తుచ్చస్థాయిలో మాట్లాడుతారని తాను ఎప్పుడూ భావించలేదని, కానీ ఆయన ట్విట్లు మాత్రం అందుకు భిన్నంగా ఉండేవని అన్నారు. రాజ్యసభ ప్యానల్ ఛైర్మన్ పదవికి ఎన్నికైన అనంతరం విజయసాయిరెడ్డి గారిని తొలగించి, మళ్లీ ఎంపిక చేసిన తరువాత ఆయనలో స్పష్టమైన మార్పు కనిపించిందని అన్నారు. రాజ్యసభ ప్యానల్ ఛైర్మన్ గా ఆ కుర్చీలో కూర్చునేది తక్కువ సార్లే అయినప్పటికీ ఆయనకు లభించే గౌరవమే వేరని, గౌరవానికి గౌరవం ఇవ్వడం తమ పార్టీ వారికి రుచించినట్లు లేదని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తెనాలి సభ వేదికగా ఉత్తుత్తి బటన్ నొక్కి రైతుల ఖాతాలో డబ్బులు చేసినట్టుగా నాటకమాడినప్పటికీ, దానికి విజయసాయిరెడ్డి గారు ఆహా..ఓహో అనకుండా, నిజమైన బటన్ నొక్కి రైతుల ఖాతాలు డబ్బులు జమ చేసిన ప్రధానమంత్రి గారిని అభినందించారని గుర్తు చేశారు. విజయసాయిరెడ్డి గారి ట్విట్టర్ ఖాతాకు ఎక్కువమంది ఫాలోవర్స్ ఉండటంతో ఆయన ఖాతాను ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోని ఒక వ్యక్తి వినియోగించేవారని తెలిసిందన్నారు. ఇతరుల భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి అలవాటేనని, తెలుగులో ఒక ప్రముఖ ఛానల్లో “విజయసాయిరెడ్డిని దూరం పెడుతున్నారా?, విజయసాయిరెడ్డి పని అయిపోయినట్లేనా??” అని వార్తా కథనాలు ప్రసారం చేయడం పరిశీలిస్తే, నిప్పు లేనిదే పొగరాదన్నట్లుగా ఉంది అని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.