తమ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి గారిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఆగ్రహించినట్లు తెలిసిందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ప్రభువులకు కోపం వస్తే దండనలు తీవ్రంగా ఉంటాయట అని, కొంత మంది కళ్ళజోడు కూడా విరిగి కిందపడిపోయిందని తాడేపల్లి ప్యాలెస్ వర్గాల వారు కథలుగా చెప్పుకుంటున్నారని అన్నారు.
నందమూరి తారకరత్న గారు గుండెపోటు వచ్చిన రోజే చనిపోయారని మీడియాకు చెప్పాలని విజయసాయి రెడ్డి గారిని పార్టీ నాయకత్వం ఆదేశించినట్లు తెలిసిందని, అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న గారిని దగ్గరి నుంచి చూసిన విజయసాయిరెడ్డి గారు అలా చెప్పడానికి నిరాకరించినట్లు సమాచారం అందిందని అన్నారు. దీనితో లక్ష్మీపార్వతి ద్వారా తారకరత్న గారు బ్రతికుండగానే చనిపోయినట్లుగా తమ పార్టీ నాయకత్వం మీడియాకు చెప్పించిందని, పార్టీ ఆదేశాలను తిరస్కరించిన విజయసాయి రెడ్డి గారిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసిందని అన్నారు.
గతంలో తప్పులు చేసినప్పటికీ, దుష్టులు చెప్పే మాటలు కాదని మంచి కోసం నిజంగానే విజయసాయిరెడ్డి గారు నిలబడితే అభినందనీయం అని అన్నారు. తమ పార్టీ నిబంధనల ప్రకారం ఎవరు మంచిని చెబితే, వారిని శిక్షిస్తారని, మంచికి నిలబడిన విజయ సాయి రెడ్డి గారిని పార్లమెంటరీ పార్టీ నాయకత్వ పదవి నుంచి కూడా తప్పిస్తారేమోననే అనుమానాన్ని రఘురామకృష్ణ రాజు గారు వ్యక్తం చేశారు.